పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

3
- Advertisement -

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు ఎంఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి నివాసాలు, వ్యాపార సంస్థలపై ఈడీ సోదాలు జరిగి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని వట్టినాగులపల్లి, రాజేంద్రనగర్ సమీపంలోని మానస హిల్స్ (కోత్వాల్‌గూడ) ప్రాంతాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయనకు చెందిన సంస్థలు భారీ అక్రమాలకు పాల్పడ్డాయని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఈడీ దృష్టికి తీసుకెళ్లింది.

వట్టినాగులపల్లిలోని విలువైన భూములను కబ్జా చేసేందుకు అధికార ప్రాభవాన్ని ఉపయోగించి అక్రమ సర్వేలు, ఒత్తిళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.మానస హిల్స్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా మంత్రి కుమారుడికి చెందిన ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ క్వారీ క్రషింగ్ యూనిట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ, సహజ వనరులను దోచుకుందో ఆధారాలతో సహా వివరించారు.

2024 సెప్టెంబర్‌లో పొంగులేటి ఇళ్లు, ఆఫీసులతో సహా 16 ప్రాంతాల్లో నిర్వహించిన ఈడీ సోదాల్లో భారీగా నగదు, కీలక పత్రాలు దొరికినట్లు వార్తలు వచ్చిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు.సోదాలు జరిగి రెండేళ్లు కావొస్తున్నా కేసు పురోగతి ఏమిటి? తనిఖీల్లో ఏమేం స్వాధీనం చేసుకున్నారు? మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ అంశాలపై ఈడీ తక్షణమే బహిరంగ ప్రకటన విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి వ్యవహారంలో ఈడీ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ మండిపడింది. ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలను ప్రజాక్షేత్రంలోనూ, న్యాయస్థానాల్లోనూ ఎండగడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

- Advertisement -