బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంషాబాద్ సమీపంలోని బహదూర్‌గూడ రైతులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, మళ్లీ అధికారంలోకి రాగానే రైతులకు హక్కు పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. తెలంగాణలో భూముల చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. బహదూర్‌గూడ భూములే కాదు, శంషాబాద్ నుంచి తన స్వంత నియోజకవర్గం కొడంగల్ వరకు నేరుగా రహదారి వేసుకుంటున్నారు. ఆ రోడ్డుకు ఇరువైపులా రేవంత్ రెడ్డి బినామీలు భూములు కొనుగోలు చేస్తున్నారు” అని ఆరోపించారు.
బహదూర్‌గూడ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు వివేక్ వెంకటస్వామి, బలరామ్ నాయక్ లాంటి వాళ్లు భూములను దోచుకుంటుంటే.. ఆ నిందను బీఆర్ఎస్ నాయకులపై తోసేసేందుకు బట్టకాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. బుల్లెట్ ట్రైన్ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదు. మరో రెండేళ్లలో కేసీఆర్ గారు మళ్లీ సీఎం అవుతారు, కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్ సీఎం కాగానే బహదూర్‌గూడలోనే బహిరంగ సభ పెట్టి, కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు భూముల పట్టాలు అందిస్తాం. ఇది బీఆర్ఎస్ ఇస్తున్న మాట అన్నారు.
Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అంతకుముందు బాధితులైన బహదూర్‌గూడ రైతులు కేటీఆర్‌కు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన తప్పుడు రిపోర్టులను పట్టుకుని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటో సీఎం వచ్చి తెలుసుకోవాలి అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ‘మీ భూములు మీరే సాగు చేసుకోండి’ అని కొండంత అభయం ఇచ్చారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ పేరుతో తమ నోటికాడి కూడును లాక్కుంటోందని వాపోయారు. తమ భూములు పోకుండా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేటీఆర్‌ను కోరారు.

