కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపిన మహేష్..‌

165
mahesh
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలపై తెలుగు చిత్ర పరిశ్రమ సంతోషంతో పండగ చేసుకుంటుంది. కేసీఆర్‌ను సీనీ ప్రముఖులు కొనియాడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోలో టాలీవుడ్‌పై ఈయన ప్రేమ కురిపించాడు. అందులో భాగంగానే సినిమాలను..సినిమా కార్మికులను ఆదుకునేలా చాలా ప్రయోజనాలు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిరు, నాగర్జున, వెంకటేష్, రాజమౌళి లాంటి దిగ్గజాలు సహా అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినీ పరిశ్రమ కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాయని మహేష్‌ తెలిపాడు. సినిమా పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎంకు కృతఙ్ఞతలు తెలిపాడు మహేష్ బాబు. ఎంతో మంది కార్మికుల జీవితాలను కాపాడుకునే నిర్ణయాలు తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్.

10 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీలు రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అంతా ఆనందంలో మునిగిపోయారు. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాడు ఈయన. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటును కల్పించారు కేసీఆర్. పరిశ్రమలో ఉన్న దాదాపు 40 వేల కార్మికులకు రేషన్‌ కార్డ్‌, హెల్త్‌ కార్డుల సదుపాయం కల్పించి వారిని కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దాంతో సినిమా పరిశ్రమలోని పెద్దలంతా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

- Advertisement -