సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:హరీశ్‌

233
harishrao
- Advertisement -

వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తమై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అధికారిక యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేలా సమన్వయంతో వ్యవహరించాలని ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారిక వర్గాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. శనివారం ఉదయం హైదరాబాదులోని తన నివాసం నుంచి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారిక యంత్రాంగం మొత్తం 1280 మందితో గంటసేపు మంత్రి హరీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది జిల్లాలో వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలి 600 డెంగీ కేసులు నమోదయ్యాయని, ఈ యేటా వర్షాలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సీజనల్ వ్యాధులను ఆరికడదామని, ఇందు కోసం జిల్లాలోని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.

గ్రామస్థాయి సర్పంచ్ మొదలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పట్టణ స్థాయిలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లతో పాటు పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ.. భవిష్యత్తులో వచ్చే సీజనల్ వ్యాధులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.డీపీఓ, డీఏంహెచ్ఓ, ఆర్డబ్ల్యూఎస్, పట్టణ ప్రాంత మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో వ్యవహరించి సమిష్టిగా పని చేస్తేనే ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా నివారించి ప్రజలను కాపాడగలుగుతామని సూచించారు.

ఓ వైపు కరోనా ఉధృతి విజృంభిస్తున్న తరుణంలో వర్షాకాల దృష్ట్యా జూన్, జూలై నెలలో ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, కరోనా పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కరోనా విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలని ప్రజలకు వివరించి చెప్పాలని.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, ప్రతి అరగంటకు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, గోరు వెచ్చని నీళ్లు తాగడం, కరోనా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్ సీకి సంబంధించన సంత్ర, ఉసిరి, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి తదితర సీ విటమిన్ ఎక్కువగా తీసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

గ్రామ పంచాయతీ మైకు సిస్టమ్, ఇతర మీటింగులు, ప్రత్యేక చర్చల ద్వారా వేడిగా ఉన్న ఆహారం తినేలా ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు మంత్రి సూచించారు.ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఏం, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఈ కరోనా, సీజనల్ వ్యాధుల వ్యాప్తి విపత్కర పరిస్థితుల్లో కరోనా, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏఎన్ఏం, స్టాఫ్ నర్సు, పీహెచ్ సీ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, మలేరియా సిబ్బంది, ఆశా వర్కర్లపై ఉన్నదని ఆదేశాలు జారీ చేశారు.

దేశ వ్యాప్తంగా కరోనా పెరిగే అవకాశం ఉన్నదని, రానున్న 45 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఓ వైపు కరోనా, మరో వైపు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ లాంటి వైరల్ ఫీవర్లతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తలు పాటించేలా క్షేత్రస్థాయిలో కావాల్సిన చర్యలు, ప్రజలకు అవగాహన కల్పించాలంటూ.. సీజనల్, కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరు బయటకు తిరగకుండా బయటకు రాకుండా.. ఇంట్లోనే ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిక సిబ్బందిని మంత్రి ఆదేశించారు.

వర్షాకాలం ప్రారంభమైన కారణంగా దోమలు, ఈగలు వృద్ది చెందుతాయని, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం ప్రభుత్వం డ్రైడే నిర్వహిస్తున్నదని, క్షేత్రస్థాయిలో ప్రజాభాగస్వామ్యంతో ఖచ్చితంగా డ్రైడే అమలు జరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని మంత్రి సూచించారు.పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సర్పంచ్, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది కలిసి డ్రైడేను పూర్తిస్థాయిలో పక్కాగా జరిపి ప్రతి వారం, వారం నివేదికలను మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి పంపాలని ఆదేశించారు.

గ్రామం, పట్టణం, వార్డుల్లో నీటి గుంత కనపడకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులే ప్రాథమిక బాధ్యతగా తీసుకుని పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నదని, నీరు నిలిస్తే.. దోమ కుట్టుతుందని, గుంతలు, మురికి కాలువలు, పెంట కుప్పలు, ఇంటి ముందు.. ఇలా ఎక్కడా కూడా నీటి నిల్వ లేకుండా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచిస్తూ.., గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పై మురికి కాల్వల్లో వర్షం నీరు నిలుస్తుంటుందని పలు ఉదాహరణలుగా వివరించారు. గ్రామ, పట్టణ పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది, సర్పంచ్ లదేనని, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు కలిసి పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో క్షేత్రస్థాయిలో కలియ తిరగాలని, ఎక్కడా నీటి నిల్వ ఉన్న డ్రైన్ లోకి వెళ్లేలా.. అవసరమైతే.. ఆ చోట మొరం పోయించి గుంతలు పూడ్చాలని ఆదేశించారు.

ఈ మేరకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కమిటీ, వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్త చర్యల గురించి టెలి కాన్ఫరెన్సులో డీఏంహెచ్ఓ మనోహర్ వివరించగా, సీజనల్ వ్యాధుల విషయమై వారం, పది రోజులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.ఈ నెల 1వ తేది నుంచి 8వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించినట్లు, ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రైడే జరుపుతున్నామని, జిల్లాలో 70 శాతం ప్రజలకు అవగాహన కల్పించామని, మిగిలిన మరో 30 శాతం మంది ప్రజలకు కూడా ప్రజాభాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నామని అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీపీఓ సురేశ్ బాబులు తెలుపగా, ప్రతి నిత్యం అధికారిక, సిబ్బందితో సమీక్ష జరిపి వారం, 10 రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ ను మంత్రి ఆదేశించారు.

తాగునీటి సరఫరా ద్వారా డయేరియా వ్యాధి వస్తున్న దృష్ట్యా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస చారి వివరించారు. కాగా రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల వారీగా విభజించే అంశం, శుద్ధినీటి పై చర్చించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి మనిషికి ఎంత మేర ఎన్ని లీటర్ల తాగునీటిని అందిస్తున్నామో.. వివరిస్తూ.. అన్నీ చోట్ల తాగునీటి సరఫరాకు ఏలాంటి ఆటంకాలు రావొద్దని సూచించారు.

టెలి కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా మంత్రి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా వారం రోజులు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, మరో వైపు కరోనా వ్యాధి వ్యాప్తి విస్తృతమవుతున్న వేళ నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనలు కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతామని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా అధికార యంత్రాంగమంతా సమన్వయంతో వ్యవహరించి కరోనాతో పాటుగా.., ఈ సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు, నివారణ నిర్వహణ కై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతినిధులు ప్రాంతాల వారీగా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన నిర్వహణ, నివారణ చర్యల గురించి టెలి కాన్ఫరెన్సులో మంత్రి, అధికారిక యంత్రాంగంతో సమీక్షించారు. ఈ టెలి కాన్ఫరెన్సులో పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఓడితెల సతీష్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, రఘోత్తం రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజమ్మీల్ ఖాన్, సిద్ధిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపల్ చైర్మన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఏంపీటీసీలు, మండల, గ్రామ, జిల్లా వైద్యాధికారులు, మండల, గ్రామ, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -