నందమూరి హరికృష్ణ మరణం ఒకపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుండగా, మరోపక్క ఆయన ఆశీస్సులతో పెళ్లిచేసుకోవాలని ఎదురుచూస్తున్న వధూవరుల ఇంట విషాద ఛాయలను అలుముకునేలా చేసింది. ఎంతో వైభవంగా కళకళలాడుతూ కనిపించాల్సిన కళ్యాణమండపం, ఆయన రారనే వార్త విని కన్నీటి ఛాయలతో వెలవెలబోయింది.
హరికృష్ణను తన కుమారుడి పెళ్ళికి వచ్చి తన చేతులమీదుగా పెళ్లి జరిపించాలని కోరి, ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న సమయం లో ఈ చేదు వార్త తెలిసి స్థంభించిపోయారు హరికృష్ణ మిత్రుడు మోహన్. నెల్లూరు జిల్లా కావలి లోని బృందావన్ కళ్యాణమండపంలో కుమారుడి పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకున్న మోహన్ హరికృష్ణ గారికి ప్రమాదం జరిగిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు, తన కొడుకు పెళ్ళికి వస్తానని మాటిచ్చిన హరికృష్ణ ఇక లేడని, శాశ్వతంగా కనిపించరన్న వార్త తనని కలచివేస్తుందని మోహన్ వ్యాఖ్యానించారు. ఈ పెళ్ళికని బయల్దేరిన హరికృష్ణ మార్గమధ్యలో ప్రమాదానికి గురవ్వడం తనకి చాలా బాధకలిగిస్తుందని మోహన్ తన ఆవేదన వ్యక్తం చేసారు.