హ్యాపీ బర్త్ డే టు…జయసుధ

805
Happy birthday to Jayasudha
- Advertisement -

పన్నెండేళ్ల అమ్మాయి సుజాత తన మేనత్తను చూడడానికి సినిమా షూటింగుకు వెళ్లేది. అక్కడి నటీనటులను కళ్లార్పకుండా చూస్తూ తను కూడా సినిమాలో నటించాలని అనుకుంది. కాని తండ్రి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి ఆసక్తిని గమనించిన మేనత్త విజయనిర్మల ఆయనను ఒప్పించి తన చిత్రంలోనే అవకాశం ఇచ్చింది. అమాయకపు చూపులతో, మాటలకంటే కళ్లతోనే ఎక్కువ నటించేసింది సుజాత. అలా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన ఆ అమ్మాయే నేడు దేశమంతా గుర్తించి, మెచ్చుకునే సహజనటి అయింది. ఇప్పటివరకు దాదాపు 300 సినిమాల్లో నటించిన ఆ ముగ్ధమనోహరి జయసుధ. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

ప్రియురాలిగా కవ్వించినా, ఇల్లాలిగా కనిపించినా, మాతృమూర్తిని మరిపించినా, ఆడపడుచుగా అలరించినా.. ఆమె శైలి ప్రత్యేకం. జయసుధ ప్రముఖ కవి, రచయిత నిడుదవోలు వెంకట్రావు మనవరాలు. జయసుధ అసలు పేరు సుజాత. 1959లో డిసెంబరు 17న మద్రాస్‌లో జన్మించారు. పుట్టింది పెరిగింది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. ఆమె తల్లి కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కాని అంతగా గుర్తింపు పొందలేదు. తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా కె. బాలచందర్ “అరంగ్రేటం” ,”అపూర్వ రాగంగల్” చిత్రాల్లో అవకాశం కల్పించాడు. అపూర్వ రాగంగల్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో జయసుధ వెనుదిరిగి చూడలేదు. అప్పటికే సుజాత పేరుతో ఒక నటి సినిమారంగంలో ఉండటంతో ఆమె పేరును జయసుధగా మార్చారు.

Happy birthday to Jayasudha

జయసుధ తెలుగులో నటించి తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతి’ చిత్రంతో టాలీవుడ్‌లో తొలి బ్రేక్‌ అందుకున్నారు. హీరోయిన్‌గా పీక్‌ టైమ్‌లో ఉన్నప్పుడు ఆమె నటించిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళానికి చెందిన 24 సినిమాలు ఒక్క ఏడాదిలో విడుదలవ్వడం రికార్డ్‌. 43ఏళ్ళ సినీ కెరీర్‌లో ఐదు భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కె.రాఘవేంద్రరావు, దాసరి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు.

Happy birthday to Jayasudha

‘ఇది కథ కాదు’, ‘ప్రేమ లేఖలు’, ‘అడవి రాముడు’, ‘శివరంజని’, ‘కటకటాల రుద్రయ్య’, ‘ప్రాణం ఖరీదు’, ‘ప్రేమాభిషేకం’, ‘నాదేశం’, ‘మేఘసందేశం’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘ఆత్మ బంధువులు’, ‘ఒంటరి పోరాటం’, ‘కిరాయి దాదా’, ‘కలికాలం’, ‘రిక్షావోడు’, ‘కంటే కూతుర్నే కను’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అలరించారు.సావిత్రి తర్వాత అలాంటి పాత్రల్లో నటించిన నటిగా జయసుధకు పేరొచ్చింది.

నిర్మాతగా ‘కాంచన సీత’, ‘కళికాలమ్‌’, ‘మేరా పతి సిర్ఫ్‌ మేరా హై’, ‘అదృష్టమ్‌’, ‘వింత కోడలు’, ‘హ్యాండ్స్‌ అప్‌’ చిత్రాలను నిర్మించారు. ఉత్తమ నటిగా ఐదు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, కళాసాగర్‌, లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు, ఏఎన్నార్‌ జాతీయ అవార్డు, ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారమందుకున్నారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటికీ విభిన్న క్యారెక్టర్స్‌తో సినిమాల్లో నటిస్తున్న సహజనటి జయసుధ…మరెన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటూ greattelangaana.com మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Happy birthday to Jayasudha

- Advertisement -