సెప్టెంబర్ 20… ఈ రోజుని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలుగు వారి అభిమాన హీరో మహానటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం ఈరోజు. 20 సెప్టెంబర్ 1924 లో కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలోని వెంకటరాఘవపురం లో జన్మించారు ఏఎన్నార్. తల్లి ప్రోత్సాహంతో నాగేశ్వరరావు గారు రంగస్థల ప్రవేశం ఇచ్చారు. అప్పుడు అయన వయస్సు 9ఏళ్ళు.
ధర్మపత్ని సినిమాతో నటుడిగా కెరీర్ ని ఆరంభించి దాదాపు 75 ఏళ్ల సుధీర్గమైన తన నటనా జీవితంలో 225కి పైగా సినిమాల్లో నటించిన బహుదూర బాటసారి మన అక్కినేని. 255 సినిమాల్లో నటించి తెలుగు సినిమా కీర్తిని దశదిశలా వ్యాపింపచేసిన తొలితరం కథానాయకుడు నట సామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావు. 19 ఏళ్ల వయసులో సీతారామరాజు జననంతో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నారు. వందలాది పాత్రల్లో అసమానంగా నటించిన ఈయన దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు.
అక్కినేని నాగేశ్వరావు నటించన, ప్రతిభా వారి ‘బాలరాజు’ చిత్రం విజయవాడలో 1948 ఫిబ్రవరి 26న రిలీజై రోజుకు మూడు ఆటలతో 428 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్రంలా ఆనాడు ఏ చిత్రం ప్రదర్శించబడలేదు. పైగా ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్ ఆనాడు ఏ చిత్రం వసూలు చేయలేదు. నాగేశ్వరారావు నటించిన 43వ చిత్రం ‘రోజులు మారాయి’. 14-4-1955న రిలీజైన ఈ చిత్రం 17 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరావు నటించన ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రంతో ఈ వేడుకులు జరుపుకోవటం మొదలయింది.
‘తొమ్మిది’ పాత్రలు ధరించిన ఏకైక నటుడు…
తెలుగు చలనచిత్ర రంగంలో అక్కినేని నాగేశ్వరావు మొదటిసారిగా ప్రసాద్ ఆర్ట్‌పిక్చర్స్ సమర్పణలో విజయచాముండేశ్వరి పిక్చర్స్ (సావిత్రి స్వంత సంస్థ) వారి ‘నవరాత్రి’ చిత్రంలో తొమ్మిది పాత్రలను పొషించి మెప్పించారు. ఈ చిత్రంలో(1) కోపిష్టి గోపన్న (2) పల్లెటూరు రైతు శాంతన్నగా, (3)కుష్టు రోగి సుందరామయ్య, (4)భాగవతారు శ్రీనివాస్‌లుగా (5) పోలిస్ ఆఫీసర్ (6) నవ ప్రేమికుడు వేణుగా, (7) డాక్టర్ కరుణాకర్‌గా (8) దేవదాసుగా (9) ఆనందరావుగా ఇలా ఇందులో తొమ్మిది పాత్రలు పోషించిన ఏకైక తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరావు. ‘నవరాత్రి’ చిత్రం 22-4-1966న రిలీజైంది.
తెలుగులో మొదట ద్విపాత్రాభినయం…
అన్నపూర్ణ పిక్చర్స్‌వారు నిర్మించిన ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో మొదటిసారిగా ద్విపాత్రాభినయం గల పాత్రలు ధరించారు. ఈ చిత్రం 29-12-1961న రిలీజై రజతోత్సవం (175 రోజులు) జరుపుకొన్నది.
ఇదిలా ఉండగా.. 90 ఏళ్ల వయసులో కూడా తన తనయుడు నాగార్జున, మనువడు నాగచైతన్యతో కలసి నటించిన చిత్రం మనం. ఈ సినిమానే ఆఖరి సినిమా అవడం, మూడు తరాల అద్భుతమైన సినిమా అవడంతో ఈ సినిమాకి ప్రేక్షకులు అఖండ విజయాన్ని అందించారు.
91 ఏళ్ల వయసులో అభిమానులను శోక సంద్రంలో ముంచుతూ జనవరి 22న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి శాశ్వత నిద్రలోకి ఉపక్రమించారు అక్కినేని నాగేశ్వరరావు. ఈరోజు ఆ మహానటుడు పుట్టినరోజు సందర్భంగా స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ని స్మరించుకుందాం.