సీఈసీగా జ్ఞానేశ్ కొనసాగలేరు!

4
- Advertisement -

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన సీఈసీ పదవిలో కొనసాగకుండా చేస్తామని హెచ్చరించారు. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెడతామని అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన మాక్ పార్లమెంట్, ప్రతీకాత్మక అభిశంసన కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు ప్రజలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం కేవలం ప్రతిపక్ష నేతలు, ప్రజల సమావేశం మాత్రమే కాదని.. ఇది ఒక రాజకీయ ఆయుధమని రాహుల్ అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు సహకరించిన వారందరినీ లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన వారందరికీ ఈ కార్యక్రమం ఒక హెచ్చరిక అని అన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ కొనసాగలేరు. ఆయన పదవిలో ఉండకుండా చేయడానికి అవసరమైన ఆధారాలు ఇప్పటికే మా వద్ద ఉన్నాయి. మేము వెల్లడించే విషయాల తర్వాత కూడా బీజేపీ ఆయనను కొనసాగించాలని పట్టుబడితే.. ఆ పార్టీ అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు స్పష్టమవుతుంది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంఘం అనే సంస్థ వెనుక దాక్కుని అధికారులు ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. ఏదో ఒక రోజు దేశ ప్రజల ప్రతినిధులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపైనా రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆయన పేర్కొన్నారు. అంటే ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరి ఓటు తొలగించినట్లేనని, మొత్తం ఓటర్లలో 15 శాతం మందిపై ప్రభావం పడిందని ఆరోపించారు.

Also Read:బీపీ ట్యాబ్లెట్స్‌ తరచూ మర్చిపోతున్నారా?

2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, ప్రతిపక్ష అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా సుమారు 3 శాతం మాత్రమే ఉందని రాహుల్ గుర్తుచేశారు. అలాంటప్పుడు 15 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.

- Advertisement -