అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే చాలామంది ఆరోగ్యం బాగానే ఉందనే భావనతోనో లేదా ఇతర కారణాలతోనో మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా తరచూ బీపీ మందులను మిస్ చేయడం వల్ల గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి మందులు అందించే రక్షణ తగ్గిపోతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ESC) 2026 సమావేశంలో సమర్పించిన ఈ అధ్యయనంలో 91,339 మంది వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. తొమ్మిది క్లినికల్ ట్రయల్స్ నుంచి సేకరించిన డేటాను పరిశీలించారు. సూచించిన మందుల్లో కనీసం 80 శాతం తీసుకున్నవారిని క్రమం తప్పకుండా మందులు వాడేవారిగా, 80 శాతం కంటే తక్కువ తీసుకున్నవారిని నిర్లక్ష్యంగా మందులు వాడేవారిగా విభజించారు.
ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీపీ మందులను క్రమం తప్పకుండా తీసుకున్నవారిలో గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధులు వంటి ప్రధాన సమస్యల ముప్పు 11 శాతం తగ్గినట్లు గుర్తించారు. అదే మందులను సరిగా తీసుకోని వారిలో మాత్రం ఇలాంటి సమస్యల ముప్పు తగ్గినట్లు గణాంకపరంగా స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు.
మందులు క్రమం తప్పకుండా వాడినవారిలో సిస్టోలిక్ రక్తపోటు (బీపీ రీడింగ్‌లో పై సంఖ్య) సగటున 5.2 ఎంఎంహెచ్‌జీ తగ్గింది. మందులు సరిగా తీసుకోని వారిలో ఈ తగ్గుదల 3.0 ఎంఎంహెచ్‌జీ మాత్రమే నమోదైంది. కాలక్రమేణా మందులు వాడటంలో నిర్లక్ష్యం పెరుగుతున్నట్లు కూడా పరిశోధకులు గుర్తించారు. మొదటి ఏడాది 88 శాతం మంది క్రమం తప్పకుండా మందులు తీసుకోగా, ఐదో ఏడాదికి ఈ సంఖ్య 79 శాతానికి పడిపోయింది.
Also Read:ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!
బీపీ మందులు మానేయడం లేదా మోతాదులు మిస్ చేయడం వల్ల చికిత్స ప్రయోజనం తగ్గుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవడం, క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకోవడం అవసరం. మందుల మోతాదును స్వయంగా మార్చడం లేదా నిలిపివేయడం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

