దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో డేల్ స్టెయిన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 13,808 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ పేరిట ఉండేది. అతను 14,719 బంతుల్లో 350 టెస్టు వికెట్లు పడగొట్టాడు.
మూడో టెస్టులో విజయానికి 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు రబాడ ఆరంభంలోనే షాకిచ్చాడు. మాథ్యూ రెన్‌షా, మార్నస్ లబుషేన్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులతో రాణించిన రెన్‌షా రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలోనే లబుషేన్‌ను రబాడ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. లబుషేన్ రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా రబాడ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో వకార్ యూనిస్, మాల్కమ్ మార్షల్, మిచెల్ స్టార్క్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు డేల్ స్టెయిన్ 439, షాన్ పొలాక్ 421, మఖాయా న్టిని 390 వికెట్లతో ఈ జాబితాలో ముందున్నారు.
Also Read:బీపీ ట్యాబ్లెట్స్ తరచూ మర్చిపోతున్నారా?
రబాడ తన అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఏడో ఓవర్లో ట్రావిస్ హెడ్‌ను 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు మరింత పెరిగాయి.

