రివ్యూ : గురు

332
Guru movie review
- Advertisement -

తమిళ, హిందీ  భాషల్లో ఘన విజయం సాధించిన ఇరుద్ది సుత్రు, సాలాఖద్దూస్ సినిమాలకు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన సినిమా గురు. ఒరిజినల్ వర్షన్‌ను తెరకెక్కించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగులోనూ వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన చాలా మంది నటులు తెలుగులోనూ అదే పాత్రల్లో కనిపించారు. చాలా రోజుల తరువాత వెంకటేష్ చేసిన ఈ సీరియస్ రోల్ అభిమానులను ఎంత వరకు ఆకట్టుకుంది..? మాధవన్‌ పాత్రకు వెంకీ న్యాయం చేశారా లేదా?చూద్దాం..

కథ:

ఆది(వెంకటేష్‌)కి బాక్సింగ్‌ అంటే ప్రాణం. దేశం కోసం మెడల్ సాధించాలన్న కసితో ఉంటాడు. అయితే బాక్సింగ్‌ అకాడమీలోని రాజకీయాలు పడలేక తాను అనుకున్న లక్ష్యాల్నిసాధించలేకపోతాడు. చాలాకాలం బాక్సింగ్‌కు దూరంగా ఉండిపోయిన ఆదిని ఉమెన్స్ బాక్సింగ్ కోచ్‌గా నియమిస్తారు. అయితే అక్కడ కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న సాకుతో ఢిల్లీ నుంచి వైజాగ్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తారు.  అక్కడ రాములు (రితికా సింగ్‌) కనిపిస్తుంది. కూరగాయలు అమ్ముకొంటూ తల్లిదండ్రుల్ని పోషిస్తుంటుంది రాములు. అక్కలక్స్‌ (ముంతాజ్‌) మాత్రం బాక్సర్‌గా రాణించి తద్వారా పోలీస్‌ ఉద్యోగం సంపాదించాలనుకొంటుంది. అయితే.. రాములులో తెగువ ఆదికి నచ్చుతుంది. ఆమెలో ఓ మంచి బాక్సర్‌ దాగుందని, దానికి మెరుగులు దిద్దితే భారత్‌కు పతకాలు సాధించి పెడుతుందని నమ్ముతాడు. రాములు మాత్రం కేవలం డబ్బు కోసమే కోచింగ్‌ తీసుకొంటుంది. పైగా ఆదిని చులకనగా చూస్తుంటుంది. ఆదిపై కోపంతో కావాలని మ్యాచ్‌లు ఓడిపోతుంటుంది. అలాంటి పెంకి పిల్లని  ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దాడు? అన్నదే గురు కథ

Guru movie review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథా,నేపథ్యం,వెంకటేష్ నటన. ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేసిన వెంకటేష్ తొలిసారిగా ఓ కొత్త మేకొవర్, కొత్త బాడీలాంగ్వేజ్‌తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. తనదైన నటనతో సినిమాకు మరింత ప్లస్‌గా మారాడు వెంకీ. సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే అద్భుతమైన ఎమోషన్స్‌ను పండించాడు. ఒరిజినల్ వర్షన్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రితికా సింగ్ మరోసారి అదేస్దాయి నటనతో ఆకట్టుకుంది. విలన్ పాత్రలో జాకీర్ హుస్సెన్ ఆకట్టుకోగా నాజర్‌, భరణి, రఘుబాబు ఓకే అనిపిస్తారు. వెంకీ పాడిన పాట అలరిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్,క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది.

మైనస్ పాయింట్స్ :

వెంకటేష్‌ కోసం కొన్ని మార్పులూ చేర్పులూ చేశామని చెప్పినా.. అంత పెద్దగా కనిపించవు. పైగా హిందీలోకనిపించిన నటీనటులే దాదాపుగా ఇక్కడా తారసపడతారు. బాక్సింగ్‌ తప్ప.. మరో ట్రాక్‌ వినిపించదు.. కనిపించదు.  బాలీవుడ్‌ సినిమాలో వాడిన కొన్ని షాట్స్‌ యథాతథంగా ఇక్కడా వాడారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. సంతోష్ నారాయణ అందించిన నేపథ్య సంగీతం సినిమాకే హైలెట్.  పాటలకంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్ అందించిన మాటలు,శక్తివేల్ సినిమాటోగ్రఫి,సతీష్ సూర్య ఎడిటింగ్, వై నాట్ స్టూడియోస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడడం, వినోదం పేరుతో లేని పోని సన్నివేశాల జోలికి వెళ్లకుండా దర్శకురాలు సుధ కొంగర మంచి విజయం సాధించింది. వెంకీ నుంచి తనకు కావాల్సిన వెరీయేషన్స్‌ను రాబట్టుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.

Guru movie review

తీర్పు:

తెలుగులో క్రీడా నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా.. క్రీడ ఓ అదనపు అంశంగా ఉంటుందంతే. దాని చుట్టూ ప్రేమ, వినోదం, యాక్షన్‌ అంటూ కమర్షియల్‌ అంశాలన్నీ జోడించేస్తుంటారు.కానీ కథ పక్కదారి పట్టకుండా అనవసర సన్నివేశాల జోలికి వెళ్లకుండా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వెంకీ నటన,కథ,నేపథ్యం సినిమాకు ప్లస్ కాగా రిమేక్‌లో ఎలాంటి మార్పులు లేకుండా తెరకెక్కించడం మైనస్‌. మొత్తంగా హిందీ సినిమా చూసినవాళ్లకు ‘గురు’ ఓకే అనిపించొచ్చు. చూడని వాళ్లకు మాత్రం.. తప్పకుండా నచ్చుతుంది.

విడుదల తేదీ :31/02/2017
రేటింగ్: 3/5
నటీనటులు: వెంకటేష్, రితికా సింగ్‌
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
నిర్మాత: ఎస్‌.శశికాంత్‌
రచన, దర్శకత్వం: సుధ కొంగర

English Review : Click Here

- Advertisement -