సోమవారం పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని సీఎంతో కలిసి గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. అనంతరం పీవీ కి సంబంధించిన 9 పుస్తకాల సంకలనాలను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే కేశవరావు, పీవీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ తొమ్మిదిలో పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పీవీ శతజయంతి ఓ గొప్ప పండుగ అని గవర్నర్ తమిళిసై అన్నారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన చేసిన రచనలను నేటి తరానికి గుర్తు చేసేలా సంకలనాలను అందుబాటులోకి తీసుకురావడం చాలా మంచి ఆలోచన అని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పీవీ గౌరవించదగిన వ్యక్తి అని కలాం చెబుతూ ఉండేవారని తమిళిసై గుర్తు చేశారు.