హైదరాబాద్‌ 4 జోన్లలో మాత్రమే కరోనా కేసులు: సీఎం కేసీఆర్

404
kcr
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సిఎం తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్, కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందర్ రావు, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయింది. ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం ఆక్టివ్ కేసులున్నాయి. ఈ జోన్లలో 1442 కుటుంబాలున్నాయి. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులకు ఎవరికీ పాజిటివ్ లేదు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు పరిగణించడానికి లేదు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

‘‘కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూములు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయి. మిగతా లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయి. కేంద్రం విధించిన తాజా లాక్ డౌన్ గడువు ఈ నెల 17 తో ముగుస్తుంది. ఈ సందర్భంగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగు వ్యూహం ఖరారు చేసి, ప్రభుత్వం అమలు చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

‘‘విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణ వాసులకు పరీక్షలు నిర్వహించాలి. వైరస్ ఉంటే ఆసుపత్రికి తరలించాలి. లేకుంటే హోమ్ క్వారంటైన్ లో ఉంచాలి. హైదరాబాద్ లో దిగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి. రైళ్ల ద్వారా తెలంగాణకు చేరుకునే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి’’ అని కేసీఆర్ ఆదేశించారు.

‘‘సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయాలి. మే నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్ నెలలో ఐదు సార్లు పిచికారి చేయాలి. చెత్తా చెదారం తొలగించాలి. దోమలు రాకుండా విరివిగా ఫాగింగ్ చేయాలి. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. పట్టణాల్లో మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జడ్పిటిసి, జడ్పీ చైర్ పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. వారి వారి పరిధిలో గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలను చైతన్య పరచాలి. ప్రభుత్వం యంత్రాంగంతో పని చేయించాలి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాలు, గ్రామాల పారిశుధ్య పనులపై తగిన సూచనలు చేయాలి’’ అని సిఎం చెప్పారు.

‘‘లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించిన నిధులను విడుదల చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేశాం. జూన్ మాసానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సిఎం అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని మరో 45 బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -