ఎంపీ సంతోష్ కుమార్‌కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

251
santhosh kumar

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. పచ్చదనం ఆవశ్యకతను చాటిచెబుతూ ఆయన చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అవిశ్రాంతంగా కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులతో పాటు పలురంగాల ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.

నిరంతరాయంగా ఓ మహోద్యమంలా కొనసాగుతున్న ఈ మొక్కలు నాటే కార్యక్రమం దేశం దృష్టిని ఆకర్షించింది. ఈనేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. గ్రీన్ ఛాలెంజ్ తో ఆయన చేస్తున్న కృషికిగాను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం ఆయనకు దక్కింది. మహాత్మాగాంధీ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ప్రతినిధులు ఈ అవార్డును ఎంపీ సంతోష్ కుమార్ కు అందజేశారు.

ఆయనను ప్రత్యేకంగా సన్మానించి పురస్కారాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ .. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ను చేపట్టామని ఆయన తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వచ్చిన సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. భూమిపుత్రుడిగా తాను గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని మరింత బాధ్యతతో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డును.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.