రియల్ లైఫ్ వేరు.. రీల్ లైఫ్ వేరు.. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం లెక్కలు వేరుగా ఉంటాయి. సినిమా వాళ్లు ఎప్పుడు విడిపోతారో…కలిసుంటారో చెప్పడం కష్టం. ఇలా గతంలో ఘాటు ప్రేమలో ఉండి…తర్వాత సహజీవనం చేసి విడిపోయిన సినీ జంటలు చాలానే ఉన్నాయి. అలాంటి జాబితాలోకి చేరారు కమల్-గౌతమి.
కమల్ కొన్ని సంవత్సరాలుగా గౌతమితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల పాటు సాగిన తమ సహ జీవనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు గౌతమి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ 13 సంవత్సరాల్లో కమల్ హాసన్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని గౌతమి తెలిపారు. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే వీరిద్దరు విడిపోవడానికి గలకారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. కమల్‌తో విడిపోయిన ఆయనపై ప్రశంసలు గుప్పించింది గౌతమి. సినీ పరిశ్రమకు రాకముందే కమల్ తన కలల హీరో అని.. కమల్‌కు మరిన్ని విజయాలు రావాలని ఆమె ఆకాంక్షించారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం కమల్ హాసన్ మొదటి భార్య సారిక కూతురు అయిన శృతి హాసన్ కి మధ్య గొడవలు రావడమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఇప్పటివరకూ కమల్ – శృతి హాసన్ లు కలిసి పని చేయకపోవడంతో..ఒక్క ప్రాబ్లెమ్ ఎదురు కాలేదు. కానీ మొదటిసారికా శభాష్ నాయుడు మూవీలో తండ్రీ కూతుళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. సాధారణంగా కమల్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా గౌతమి వ్యవహరిస్తుంది. ఈ సినిమాకి కూడా కాస్ట్యూమ్స్ బాధ్యతలను ఆమే చూసుకుంటోంది. అసలు సమస్య ఇక్కడే మొదలైందట. గౌతమి సూచించిన కాస్ట్యూమ్స్ పై శృతి హాసన్ చీటికీ మాటికీ చిరాకు పడటంతో పాటు గొడవలు పెద్దవైనట్టు సమాచారం. కమల్ చాలా సందర్భాలు ఇద్దరికి నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ఫలితం లేదట. అంతేగాదు కమల్ కూడా కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్యలో నలిగిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కమల్-గౌతమి విడిపోవడానికి కారణం శృతినా లేక మరేదైనా కారణం ఉందా ప్రస్తుతానికి సస్పెన్స్.
గౌతమికి పలు విపత్కర సందర్భాల్లో కమల్ అండగా నిలిచారు. కమల్‌తో సహజీవనానికి ముందు గౌతమి వ్యాపారవేత్త సందీప్ భాటియాను 1998లో పెళ్లాడారు. వీరిద్దరికీ పుట్టిన కూతురే సుబ్బులక్ష్మి. పెళ్లైన మరుసటి ఏడాదే భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 2003 నుంచి కమల్‌తో సహజీవనం చేశారు. తెలుగులో విచిత్ర సోదరులు చిత్రం నుంచి కమల్, గౌతమిల స్నేహం చిగురించింది. 35 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌కు గురైన గౌతమి అతి కష్టం మీద ఆ వ్యాధిని జయించారు. ఆ సమయంలో ఆమెకు కమల్ తోడుగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన గౌతమి విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. గౌతమి మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం దయామయులు. ఈ సినిమా 1987లో విడుదలైంది. అక్కడి నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. తాజాగా మలయాళ స్టార్ మోహన్‌లాల్ సరసన ఆమె మనమంతా అనే సందేశాత్మక చిత్రంలో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. అయితే వీరి బంధానికి గౌతమి ఇంత అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది.