గజ్వేల్ వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో రెండు నెలల పాటు నిరవధికంగా పనులు కొనసాగడంతో త్వరలోనే గజ్వేల్‌కు రైలు పరుగెట్టబోతోంది.
ఇందులో భాగంగా ఈ నెల 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు రైల్వే అధికారులు. ఆరోజు పూర్తి స్థాయి రైలును గరిష్ట వేగంతో నడిపి పరీక్షిస్తారు. ఈ సందర్భంగా సాంకేతికంగా వెలుగు చూసే లోపాలకు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషనర్ పలు సూచనలు చేయనున్నారు. మార్పుల అనంతరం పూర్తిస్థాయిలో రైలు సేవలు ప్రారంభంకానున్నాయి.
2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గజ్వేల్‌లో పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కొత్త రైల్వే ప్రాజెక్టుగా ఇది సిద్ధం కాబోతోంది. ఇందులో తొలి దశ ఇప్పుడు ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఈనెల 25 తర్వాత సుముహూర్తం చూసి రైలు సేవలకు పచ్చజెండా ఊపనున్నారు. ప్రస్తుతానికి సింగిల్ లైన్‌గా ఉన్న ఈ మార్గంలో డీజిల్ లోకోమోటివ్‌తో రైలు తిరగనుంది. మెమూ తరహా రైళ్లను నడిపే అవకాశముంది. ఐదేళ్ల కాలంలో దీన్ని విద్యుదీకరించే అవకాశం కనిపిస్తోంది.