రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు అందించే పంట పెట్టుబడి కోసం అవసరమైన నిధులను సమకూర్చి, బ్యాంకులలో సిద్ధంగా ఉంచినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేసినట్టు సీఎం ప్రకటించారు. మే 1 నాటికే రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో రూ.4,114.62 కోట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మరో రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో జమవుతాయని తెలిపారు.
రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడికి సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 10నుంచి మొదటి విడుత డబ్బులను చెక్కుల రూపంలో అందిస్తున్నది. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులకు సరిపడా నగదును బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచుతున్నట్టు సీఎం తెలిపారు.
నగదు కోసం రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు బుధవారం రిజర్వ్‌బ్యాంకు అధికారులను కలుస్తారని సీఎం వెల్లడించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యే నాటికి మొత్తం ఆరువేల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో సిద్ధం చేయడానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఎస్‌బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, గ్రామీణ వికాస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకులలో డబ్బును డిపాజిట్ చేసి ఉంచుతున్నట్టు తెలిపారు. రైతుల కోసం డిపాజిట్ చేసిన నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అవసరాలకు వాడకూడదని బ్యాంకు అధికారులకు సీఎం స్పష్టంచేశారు.
రైతుబంధు పథకం కింద రైతులకు ఇవ్వాల్సిన చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు ముద్రణ పూర్తిచేసుకుని ఇప్పటికే మండలాలకు చేరుకున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 57.33 లక్షల పాస్‌పుస్తకాలు రైతులకు అందివ్వాలని నిర్ణయించాం. ఇందులో 4.60 లక్షల మంది తమ ఆధార్ కార్డులను అనుసంధానం చేయలేదు. ఆధార్‌కార్డును అనుసంధానం చేసిన 52,72,779 మందికి చెక్కులను, పాస్‌బుక్‌లను పంపిణీ చేస్తాం అని ఆయన చెప్పారు.