ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చాలా రాష్ట్రాలలో సినీ తారలు పోటీ పడ్డారు. కొందరు సొంతంగా పార్టీ పెట్టి బరిలో దిగగా.. మరికొందరు ఇతర పార్టీలలో చేరి టికెట్ దక్కించుకొని ఎన్నికల బరిలో దిగారు. మరి ఎవరెవరు ఏఏ పార్టీ నుండి గెలుపోందారు.. ఓటమి పాలైయ్యారో తెలుసుకుందాం!
సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన పార్టీని స్థాపించాడు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అన్ని స్థానాల నుంచి పోటీ చేశారు. పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయగా రెండు చోట్ల పరాజయం పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ వరసగా రెండోసారి విజయం సాధించారు. 2014 లో మొదటిసారి పోటీచేసి విజయం సాధించారు. ఈ సారికూడా బాలయ్య విజయం సాధించడం విశేషం.
రాజకీయాల్లో ఐరెన్ లెగ్ అంటూ అందరు ఇబ్బంది పెట్టినా 2014 ఎన్నికల్లో నగరి నుంచి విజయం సాధించింది రోజా. ఈసారి కూడా రోజా నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
కర్ణాటకలోని మాండ్యా నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత మరో సినీనటుడు నిఖిల్ గౌడ పై విజయం సాధించింది. బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఘోరపరాజయం పాలయ్యాడు.
ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ నుంచి రాంపూర్ ఎంపీగా పోటీకి దిగిన జయప్రద ఈసారి ఓటమిపాలయ్యారు. అలానే ముంబై నార్త్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బరిలోకి దిగిన ఊర్మిళ కూడా ఓడిపోయారు. బీజేపీ తరపున గురుదాస్ పూర్ ఎంపీగా పోటీ చేసిన బాలీవుడ్ హీరో సన్నీడియోల్ విజయం సాధించారు.