మోదీ చేసిన మొదటి మూడు వాగ్దానాలు ఇవే..

191

బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం, మోదీకి దీటైన నేతను ప్రజల ముందుంచడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమవ్వడం తదితర కారణాలతో మరో ఐదేండ్ల భారత భవిష్యత్తును ప్రజలు నరేంద్రునికే అప్పగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీ.. పార్టీ చీఫ్ అమిత్ షాతో కలిసి గురువారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మోదీని చూసిన కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘మోదీ, మోదీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

PM Narendra Modi

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలకు మూడు వాగ్దానాలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఎటువంటి పనులు చేయబోనని పేర్కొన్నారు. తన పూర్తి సమయాన్ని, శరీరాన్ని దేశ సేవకే అంకితం చేస్తానంటూ తొలి హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల ముందు వరకు తానెవరో దేశ ప్రజలకు పెద్దగా తెలియన్న మోదీ.. ఇప్పుడు తాను అందరికీ తెలుసని, ప్రజలు తనపై చాలా విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు.

ప్రజల తీర్పు వెనక ఉన్న భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనన్న ప్రధాని.. తానెప్పుడూ తప్పుడు పనులు చేయబోనని రెండో ప్రామిస్ చేశారు. ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం గురించి పూర్తిగా మర్చిపోయానని, దేశ హితం కోసం, దేశాభివృద్ధి కోసం తనపై చెడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరినీ దగ్గరికి తీసుకుంటానని మూడో వాగ్దానం చేశారు. అభివృద్ధికి మనందరం కలిసి పనిచేద్దాం. కాశీలోని భాజపా కార్యకర్తలు చాలా శ్రమించారు. వారందరికీ కృతజ్ఞుడినై ఉంటాను అన్నారు.