ఆదివారం అర్ధరాత్రి.. 2018 నూతన సంవత్సరం ప్రవేశించిన శుభ సందర్భం.. యావత్ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి సంబురాలు చేసుకొంటున్న మంచి తరుణం.. సరిగ్గా కొత్త ఏడాది ప్రవేశించిన ఒక్క నిమిషానికి తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించాడు. ఉమ్మడి పాలనలో దశాబ్దాల తరబడి అలుముకొన్న చీకట్లను చీల్చివేసి విద్యుత్ కాంతులను ప్రసరింపజేశాడు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వప్నం సాకారమైన క్షణమది. లక్షల రైతు కుటుంబాల్లో ఆనందం నిండిన సమయమది. వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటలపాటు నిరాఘాటంగా విద్యుత్ సరఫరా ప్రారంభమైన శుభవేళ అది.
నూతన సంవత్సరపు ఉషోదయ కిరణాలు భూమిపై మెరువకముందే తెలంగాణ పంటపొలాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. రాష్ట్రంలోని 23లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల కరంట్ సరఫరాను విద్యుత్ సంస్థలు సగర్వంగా ప్రారంభించాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ చేయలేని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది. విడిపోతే తెలంగాణ అంధకారంలో మగ్గిపోతుందన్న వారికి చెంపపెట్టుగా రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేండ్లలోనే అన్ని రంగాలతోపాటు వ్యవసాయానికి సైతం నిరంతరంగా నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చి రికార్డు సృష్టించింది. ఇప్పటికే అభివృద్ధిపరంగా, సంక్షేమపరంగా అనేక రంగాలలో దేశంలోనే నంబర్ 1గా నిలిచిన తెలంగాణ, రైతాంగానికి సమృద్ధిగా విద్యుత్‌ను అందించి.. అన్ని రాష్ర్టాలకూ మార్గదర్శకంగా నిలిచింది. ఇది టీం పవర్ సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులు సమిష్టిగా సాధించిన విజయం. తెలంగాణ రైతులను ఉత్తేజపరిచిన ఆనంద క్షణాలివి.
ఆదివారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు.. రైతుల సమక్షంలో 24గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించి.. వారు సంబురాల్లో పాలుపంచుకొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని వారు పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించారు. అన్ని జిల్లాల్లో స్థానిక విద్యుత్ ఇంజినీర్లు, అధికారులుకూడా నిరంతర విద్యుత్‌ను పరిశీలిస్తూ.. సిబ్బందికి అవసరమైన సూచనలు అందిస్తూ.. అందరినీ ఉత్సాహపరుస్తూ.. తెల్లవారుజామువరకు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో ముచ్చటించారు.
సోమవారం ఉదయం రైతులు ఎక్కువగా మోటర్లను ఉపయోగించే అవకాశం ఉండటంతో.. రానున్న డిమాండ్‌ను అంచనా వేస్తూ.. తగిన చర్యలను ఉన్నతాధికారులు చేపట్టారు. వ్యవసాయానికి నిరంతర సరఫరా కోసం ప్రత్యేకంగా 7500 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులో ఉంచారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడుపాలని భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018లో విజయవంతంగా ముందుకుసాగాలని సీఎం ఆకాంక్షించారు.