సాధారణంగా ఆర్టీసీ బస్సులలో చిన్నపిల్లలకు హాఫ్ టికెట్లు తీసుకుంటారు. కొందరైతే మా వాడు ఇంకా చిన్నవాడే అంటూ టికెట్ తీసుకోకుండా కండక్టర్ తో గొడవకు దిగుతారు. ఓ వ్యక్తికి విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలో ఆర్టీసీ కండక్టర్ హాఫ్ టికెట్ వివాదం వైరల్ అవుతోంది. బెంగళూరు గౌరీబిదనూరు సమీపంలోని ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన రెండు కోళ్లను తీసుకుని ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కండక్టర్ అతనికి మొత్తం మూడు టికెట్లు ఇచ్చాడు.
మూడు టికెట్లు ఇచ్చావేంటి అడగగా… నీకు ఒక ఫుల్ టికెట్, నీ రెండు కోళ్లకు రెండు హాఫ్ టికెట్లు సమాధానం ఇచ్చాడు. కోళ్లకు టికెట్లు ఏంటని ప్రశ్నించగా.. కోళ్లకు కూడా హాఫ్ టికెట్లు తీసుకోవాలని చెప్పాడు. అయితే టికెట్ల వెనకాల పిల్లలకు అని ఎందుకు రాసిచ్చావని, కోళ్లకు టికెట్లు తీసుకున్నా అని రాసివ్వాలని కండక్టర్ తో గొడవకు దిగాడు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. కోళ్లు, గువ్వలు, చిలుకలు వంటి వాటికి హాఫ్ తీసుకోవాల్సిందే అని సూచించారు. ఇక బస్సులోని ప్రయాణికులతో పాటు, ఈ వార్త విన్న ప్రజలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.