కారుకు భారీ మెజారిటీ ఇచ్చిన సర్వేలు
టిఆర్ఎ్ను గెలిపించేది అభివృద్ధి-సంక్షేమమే
రెండోస్థానం కోసం బిజెపి, కాంగ్రెస్ పోటీ
టిఆర్ఎస్కు 42 శాతం ఓట్లు..?
బిజెపికి 38.5 శాతం ఓట్లు..?
కాంగ్రెస్ పార్టీకి 16 శాతం ఓట్లు..?
దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ముక్తకంఠంతో వెల్లడించాయి. పల్స్ టుడే, థర్డ్ విజన్ రీసెర్చి, ఎస్.ఎ.ఎస్ గ్రూప్, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్, తెలంగాణ జర్షలిస్టుల అధ్యయన వేదిక, జనంసాక్షి ఇలా ఒక్కటేమిటీ ప్రతి ఒక్క సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించి ఇచ్చిన ఫలితాల్లో టి.ఆర్.ఎస్.పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి, కారు గుర్తుకు ఏకంగా 42 శాతం ఓట్లు వస్తాయని, బిజెపి అభ్యర్థికి 38.5 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం 16 శాతం ఓట్లు వస్తాయని ప్రకటించాయి.
చివరకు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ప్రకటించడంతో అని పార్టీల నాయకులకు, రాజకీయ పరిశీలకులు, సీనియర్ పాత్రికేయుల విశ్లేషణలు కూడా టి.ఆర్.ఎస్.పార్టీ గెలవడానికి దారితీసిన అంశాలపై చర్చోపచర్చలు జరువుతున్నాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో డబ్బు, బంగారం, మద్యం, మాంసం, ఇతర బహుమతులే ప్రధాన భూమిక పోషించాయని, బిజెపి నేతలు డబ్బును విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపణలు భారీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు, ఓటర్లను ప్రలోభపెట్టడం కోసం అడ్డదారులు తొక్కిన నేతల బండారం ఎలాగూ బట్టబయలయ్యింది కనుక డబ్బులు తీసుకొని కూడా టి.ఆర్.ఎస్.పార్టీకే ఓట్లు పడ్డాయనే చర్చ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయించలేదని, గత ఎన్నికల సమయంలో తప్ప ఆ తర్వాత గడచిన నాలుగేళ్ళల్లో కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గం ప్రజలను పలకరించిన పాపానపోలేదనే కోపం, ఆగ్రహంతో ప్రజలు బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారని నియోజకవర్గంలో పర్యటించిన పలువురు సీనియర్ పాత్రికేయులు తెలిపారు.
టి.ఆర్.ఎస్. ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా అభివృద్ధి-సంక్షేమ పథకాలే గెలిపిస్తున్నాయని అంటున్నారు. మున్సిపల్ శాఖామంత్రి కె.తారక రామారావు నిర్వహించిన రోడ్ షోలు, సభలకు ప్రజలు అశేషంగా రావడం, మంత్రులందరూ ప్రజలతో మమేకమైన తీరుకు మునుగోడు జనం ఫిదా అయ్యారని తెలిపారు. మరీ ముఖ్యంగా మునుగోడు ప్రజలను అనేక దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యను టి.ఆర్.ఎస్. ప్రభుత్వమే పరిష్కరించి రక్షిత మంచి నీటిని మిషన్ భగీరథ పధకంతో ఇంటింటికీ నల్లాలతో అందించడం ఆ నియోజకవర్గం ప్రజలు మరచిపోలేదని, జనం గుండెల్లో మిషన్ భగీరధ చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. అంతేగాక వానాకాలంలో కూడా మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగడానికి, సాగుకు కూడా నీరు దొరకని ఎడారి పరిస్థితులు ఉండేవని,కానీ రాష్ట్ర విభజన తర్వాత టి.ఆర్.ఎస్.పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్న పునరుద్ధరించడంతో వేసవిలో కూడా పుష్కలంగా నీరు ఉంటుందని, భూగర్భ జలాలు భారీగా పెరిగాయని, దానికి అనుబంధంగా వ్యవసాయానికి ఉచితంగా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుండటంతో ఏడాదికి రెండు పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయలను సాగుచేస్తున్న మునుగోడు ప్రజలు ఈ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.పార్టీ పట్ల తమకున్న నమ్మకం, విశ్వాసాన్ని చాటుకొన్నారని సర్వేలు చేసిన సీనియర్ పాత్రికేయులు వివరించారు.
టి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో జరిగిన మొత్తం తతంగాన్ని సమర్ధవంతంగా మునుగోడు ప్రజలకు తెలియజేయడంలో కారు పార్టీ విజయం సాధించడం కూడా పోలింగ్ లో కలిసి వచ్చిందని అంటున్నారు. అంతేగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తెలంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు అనుసరిస్తున్న తప్పడు విధానాలను ఎండగట్టడం కూడా మునుగోడులో విద్యావంతులను ఆలోచింపజేసిందట. అంతేగాక దుబ్బాక,హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకాకపోవడం, మునుగోడు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం ఏం చేస్తామో కూడా కమలం పార్టీ చెప్పలేకపోయిందని, అంతేగాక కేవలం అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్. పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమైన నాయకులు తాము గెలిస్తే ఏమి చేస్తామనే అంశాలను ప్రజలకు వివరించలేకపోవడం కూడా ప్రజలను ఆలోచింపజేసింది. దీనికి తోడు టి.ఆర్.ఎస్.పార్టీనేతలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన వైనం, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటిన అంశాలపై ప్రజల్లో సహజంగానే బిజెపిపైన ఉన్న వ్యతిరేకత మొత్తం ఉప ఎనికల పోలింగ్ లో ప్రతిబింభించాయని అంటున్నారు. ఒకవేళ బిజెపి డబ్బులు ఇస్తే తీసుకోవాలని, డబ్బులు తీసుకొన్నప్పటికీ ఓట్లు మాత్రం టి.ఆర్.ఎస్.కే వేశారని సీనియర్ పాత్రికేయులు వివరించారు. అంతేగాక ఈ ఎన్నికలు వచ్చిందే రాజగోపాల్ రెడ్డికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసమే ఎన్నికలు వచ్చాయేగానీ మరే ఇతర కారణాలు లేవని, అందుకే బిజెపి అభ్యర్థి ఇస్తానన్న పైసలన్లీ తీసుకొన్నామని ఓటర్లు బాహాటంగానే తమకు వివరించారని సర్వేల్లో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు వివరించారు. ఇలా టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చేసిన అభివృద్ధి- సంక్షేమ పథకాలే నేడు మునుగోడులో ఆ పార్టీని గెలిపిస్తున్నాయని తెలిపారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమౌతాయో… లేదో… ఈ నెల ఆరో తేదీన తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి..