మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరలో జరిగే ఎన్నికల్లో పోటి చేయడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆయన్ను ఎలాగైన బరిలో నిలపాలని భావిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ పార్లమెంట్ స్ధానం నుంచి మన్మోహన్ పోటీ చేయించాలని అనుకుంటుంది పంజాబ్ కాంగ్రెస్. కానీ ఆయన ఆరోగ్యం సహాకరించకపోవడంతో ఈ ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఇక మన్మోహన్ సింగ్ పోటీపై స్పందించారు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ ఆశాకుమారి.
పార్టీ వర్గాలు ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2009ఎన్నికల్లో ఆయన ఆరోగ్యం సహాకరించపోవడంతో ఆయన లోక్ సభకు పోటీ చేయలేదు. ఆ తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి అమరీందర్ సింగ్ పోటీ చేసి విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ పోటీ చేసే విషయంపై రాహుల్ గాంధీతో చర్చించి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు ఆశాకుమారి. అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ అసోం నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్ 14తో ముగియనుంది.