సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి, పర్వతగిరి మండలం అన్నారం గ్రామాల్లో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి… కరోనా ఎఫెక్ట్ కారణంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఈ తరుణంలో తెలంగాణ సీఎం కెసిఆర్, అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
అందరికంటే ముందే లాక్ డౌన్ విధించి దేశానికే ఆదర్శమైన కెసిఆర్, ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పారని తెలిపారు ఎర్రబెల్లి. లాక్ డౌన్ కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వలేదు. నిత్యావసర సరుకులు అందించారు. ధరలను అదుపులో ఉంచారని చెప్పారు.
12కిలోల బియ్యం, రూ.1500 ఆర్థిక సాయం…వలస కూలీలను సైతం కన్నబిడ్డల్లా చూసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, సిఎం కెసిఆర్ దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం చరిత్రాత్మకం అన్నారు.
రైతుల పంటలను ఆలస్యమైనా ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక రైతు బంధు పథకం కింద రూ.7వేల కోట్లు, 25 వేల రూపాయల లోపు రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయడానికి 1200 కోట్లు విడుదల చేశారని చెప్పారు.
ఈ కష్టకాలంలో కూలీలకు ఉపాధి కల్పించడానికి రూ.170 కోట్లు విడుదల చేశారని….లాక్ డౌన్ సమయంలోనే గ్రామ పంచాయతీలకు రూ.370 కోట్లు విడుదల చేశారని తెలిపారు.
ఆర్థిక మాంద్యంతోపాటు, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, సిఎం కెసిఆర్ ప్రజావసరాలను, అత్యవసరాలకు ఎక్కడా లోటు రాకుండా అన్నిజాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే 25వేల లోపు రుణాలున్న రైతులకు ఆ రుణాలన్నీ మాఫీ అవుతాయి. అధికారులు అదే పనిలో ఉన్నారని వెల్లడించారు.
జూన్ నుంచే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని…మరోవైపు వచ్చే వానాకాలం కోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారన్నారు. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నీటినే కాకుండా, దేవాదుల ప్రాజెక్టు ద్వారా మరింత సాగు, మంచినీటిని ఇవ్వడానికి చర్యలు మొదలు పెట్టారు. మన ప్రాంతంలో మరిన్ని రిజర్వాయర్లు రానున్నాయన్నారు.