కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి కరోనా రోగులకు అండగా నిలిచి, వారిలో ఆత్మస్థైర్యం నింపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కరోనా బాధితులకు 16 రకాల నిత్యావసర వస్తువుల కిట్లను మంత్రి ఆదివారం నాడు పంపిణీ చేశారు. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని దాదాపు 4 వేల మంది కరోనా రోగులకు మంత్రి అండగా నిలిచారు. అందులో భాగంగానే ఎర్రబెల్లి దయాకరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఆయన కొడకండ్ల లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కరోనా ఔషధాలను క్రమం తప్పకుండా వాడి కరోనా వైరస్ ను జయించాలని ఆయన కోరారు. ప్రస్తుత కరోనా రెండవ విడతలో పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా రోగులకు ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్, దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇప్పటి వరకు 40 లక్షల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు, మాస్కులు, డ్రైఫ్రూట్స్, భోజనాలు పంపిణీ చేశామని మంత్రి చెప్పారు.
కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ గారు అన్ని చర్యలు తీసుకుంటున్నందున రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలకు కావాల్సిన కరోనా వ్యాక్సిన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ సేకరిస్తుందని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ బారిన పడినవారు అధైర్య పడవద్దన్నారు. ధైర్యంగా వైరస్ ను జయించాలని ఆయన సూచించారు. అంతకు ముందు మంత్రి కొడకండ్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, కరోనా రోగుల చికిత్స కోసం చేపట్టిన ఏర్పాట్లను డాక్టర్లను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య చికిత్స కోసం పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా రోగుల చికిత్స లో ప్రధాన పాత్ర వహించే ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, దాతలు అందిస్తున్న ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ నిధి పధకం క్రింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రికి 10, కొడకండ్ల, పాలకుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 3 చొప్పున, దేవరుప్పుల, రాయపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 4 చొప్పున ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డిసిసిబి వైస్-చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్పీపి జ్యోతి రవింద్రనాయక్, మార్కెట్ చైర్మన్ పేరం రాము, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.