రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈనేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పలు సంఘాల ప్రతినిధులు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక బలహీనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలకు వర్తించే విధంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయా సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సమసమాజం సాధించే దిశగానే సీఎం కేసీఆర్ ఆర్థిక బలహీనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు పొందని వైశ్య, రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, మార్వాడీ జైన్, ముస్లీం మైనార్టీల్లో సయ్యద్, ఖాన్ మొదలైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తేనే, సమాజం సమ తూకంగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న అగ్రకులాల వారికి ఎంతో ఊరట కలుగుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయం పట్ల అన్ని సామాజిక వర్గాల్లోనూ సంతోషాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను యథాతథంగా ఉంచుతూనే, రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనులైన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.