ఈ రోజు నుండి చెన్నై వేదికగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మొదలైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో మొదటి రోజే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తడాఖా చూపించాడు. భారత బౌలర్లకు సవాల్‌గా నిలిచిన రూట్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. 197 బంతులాడిన రూట్ 14 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఇది రూట్ కు వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
ఇక, ఇంగ్లండ్ జట్టు విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రూట్ సెంచరీ, ఓపెనర్ డామ్ సిబ్లీ (87) అర్ధసెంచరీ సాయంతో తొలి రోజు ఆట చివరికి మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఆటకు చివరి బంతికి సిబ్లే అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోరీ బర్న్స్ 33 పరుగులు చేశాడు. బుమ్రాకు రెండు వికెట్లు, అశ్విన్ కు ఓ వికెట్ లభించింది.
ఈ ఏడాది ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆడిన ప్రతి టెస్ట్‌లో సెంచరీ చేయడం విశేషం. శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లోనూ రూట్ సెంచరీలు బాదాడు. ఆ టీమ్‌తో రెండు టెస్టుల్లో వరుసగా 228, 186 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇండియాలోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.