IND vs ENG :రెండో టెస్ట్ గెలవాల్సిందే?

25
- Advertisement -

టీమిండియా ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టెస్ట్ పూర్తవగా అందులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇక రెండవ టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండవ టెస్ట్ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉండగా అటు ఇంగ్లాండ్ కూడా మొదటి మ్యాచ్ గెలిచిన జోష్ కొనసాగించాలని చూస్తోంది. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ లో గెలవడం టీమిండియా కు చాలా కీలకమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే మొదటి టెస్ట్ ఓటమితో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా ఉన్న టీమిండియా ఒక స్థానం కిందకు పడిపోయింది. దాంతో తిరిగి అగ్రస్థానంలోకి చేరుకోవాలంటే రెండవ టెస్ట్ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తుదిజట్టులో ఎవరెవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పూజారా వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో మొదటి టెస్ట్ ఓటమి మూటగట్టుకుందనే భావన చాలామంది క్రీడాభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేసేలా బీసీసీఐ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. యువ ఆటగాడు సర్ఫరాజ్ కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ మ్యాచ్లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

ఇక రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ వంటి వారు గాయం కారణంగా రెండవ టెస్టుకు దూరమయ్యారు. దాంతో సౌరబ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ తుదిజెట్టులో స్థానం దక్కించుకోనున్నారు. ఇక ఓపెనర్స్ విషయంలో కూడా మార్పులు చేయాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. జైస్వాల్, గిల్ లను ఓపెనర్స్ గా బరిలోకి దించి రోహిత్ శర్మను మూడో స్థానంలో ఆడిస్తే మంచిదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఏది ఏమైనప్పటికీ విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్టు టీమిండియా కు కీలకంగా మారింది. ఈ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఎలా రాణిస్తుందో చూడాలి.

Also Read:కందగడ్డ తింటే ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -