పిక్నిక్ స్పాట్‌గా మారిన ఎన్‌కౌంటర్‌ స్పాట్‌..

239
Online News Portal
Encounter site unguarded
- Advertisement -

మనిఖేడి పహాడీ.. ఇప్పుడీ ప్రదేశం హాట్ టాపిక్‌గా మారింది. 8 మంది సిమి ఉగ్రవాదులని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన స్థలం ఇది. 8 మంది సిమి ఉగ్రవాదులు హెడ్‌కానిస్టేబుల్‌ని చంపి భోపాల్‌ కేంద్ర కారాగారం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రదేశం ఓ పిక్నిక్ స్పాట్‌గా మారిపోయింది. ఎన్‌కౌంటర్‌ ఘటన సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఇంకా అక్కడ ఉండగానే.. స్థానికులు ఈ ప్రాంతానికి వచ్చి తెగ సెల్ఫీలు దిగేస్తున్నారు. పిక్నిక్‌ స్పాట్‌గా దాన్ని మార్చేశారు.

ఎనిమిది మంది సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ తరువాత ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పోలీసులు ఎలాంటి బారికేడ్లు.. భద్రత ఏర్పాటు చేయలేదు. పారిపోయిన ఉగ్రవాదులు ధరించిన దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలాగే రక్తం మరకలు ఎండిపోయి ఉన్నాయి. ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారని.. కొందరు ఆ ప్రదేశంలో కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ పిక్నిక్‌లాగా సమయం గడుపుతున్నారని స్థానిక పత్రికలు రాశాయి. ఇదే విషయమై మీడియా పోలీసులను ప్రశ్నించగా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆ ప్రాంతంలో తమకు అవసరమైన సాక్ష్యాలన్నీ తీసుకున్నామని, అందుకే బారికేడ్లు ఏర్పాటుచేయలేదని ఎస్పీ ధరంవీర్‌ సింగ్‌ తెలిపారు. టూత్‌బ్రష్‌లను తాళం చెవులుగా ఉపయోగించి, దుప్పట్ల సాయంతో గోడదూకి భోపాల్‌ సెంట్రల్‌ జైలు నుంచి సిమి ఉగ్రవాదులు తప్పించుకున్నారని ఆయన చెప్పారు.

-bhopal-encounter-pti

ఇక సిమి ఉగ్రవాదుల పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఒక్కో ఉగ్రవాదిని కనీసం రెండు సార్లు కాల్చారని వెల్లడైంది. కొందరికి వెనుక నుంచి బుల్లెట్‌ తగిలిన గాయాలని.. ఎక్కువగా ఛాతీ భాగంలో, తలలో బుల్లెట్లు తగిలినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై పలు ఆరోపణలు వస్తున్నాయి. నిరాయుధులైన వారిని చాలా దగ్గరి నంచి పోలీసులు కాల్చి చంపారని బయటకు వచ్చిన కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -