తెలంగాణలో ఇంటింటికీ వెళ్లి…. పరిశుభ్రత కార్యక్రమాల చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇళ్లకు వచ్చినప్పుడు అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీవో, పీవోలతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ మరియు ఆయా శాఖలకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. పరిశుభ్రతపై ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు సైతం సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హరీశ్‌రావు కోరారు.