వర్మకు రాధా వార్నింగ్‌….

377
Director Ram Gopal Varma Meets Vangaveeti Radhakrishna
- Advertisement -

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమా వంగవీటి. బెజవాడ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా పై వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో వంగవీటి టైటిల్ సాంగ్‌ను తొలగిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇవాళ విజయవాడలో వంగవీటి ఆడియో లాంఛ్ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ‘వంగవీటి’ చిత్రం వివాదంపై చర్చించడానికి వంగవీటి రాధాకృష్ణతో రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు.

దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో వంగవీటి సినిమాలో కొన్ని సీన్స్‌‌పై చర్చ జరిగింది. భేటీలో వంగవీటి రాధా, రత్న తమ అభ్యంతరాలను వర్మకు వివరించారు. అభ్యంతరాలు విన్న రాంగోపాల్ వర్మ మాత్రం స్పందించలేదు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇదే విషయాన్ని వర్మ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు.

‘ఇప్పుడే రాధ, అతని తల్లిని కలిశాను. ఈ భేటీ అంత సాఫీగా సాగలేదు.. సమస్యలు.. నేను రాజీపడేది లేదు. ఏమౌతుందో చూద్దాం’.
‘నేను చాలా సీరియస్‌ వార్నింగ్‌లను చూశా. కానీ తొలిసారి నవ్వుతూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన వారిని చూశా. ప్రమాదకరం.. కానీ ‘వంగవీటి’పై నా దృక్పథం విషయంలో రాజీపడను’.
‘ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు.. కానీ చాలామంది రాధా- రంగా మిత్రమండలి కార్యకర్తలు మాకు అండగా ఉన్నారు. వారిని నేను ఆడియో వేడుకకు ఆహ్వానించాను’ అని వర్మ వరుస ట్వీట్లు చేశారు.

వర్మ వచ్చి మాట్లాడతామంటేనే వచ్చి మాట్లాడాం.. సినిమాపై తమకున్న అభ్యంతరాలను వర్మకు వివరించామన్నారు వంగవీటి రాధా. రంగాను కించపర్చేలా సన్నివేశాలుంటే సహించేది లేదని రాధాకృష్ణ తేల్చిచెప్పారు. వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగించాలని వర్మను ఆయన కోరారు. రంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని ఆయన చెప్పారు. కేసులో కోర్టులో ఉంది.. అక్కడే తేల్చుకుంటాం..వర్మ వివరణ ఇవ్వాలి అని రాధాకృష్ణ సీరియస్‌‌గా చెప్పారు. వర్మను మర్యాదపూర్వకంగానే తాము కలిశామని ఆయన మీడియాకు వివరించారు.

ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదని ఈ చర్చల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. ‘వర్మ, రాధ ఎవరూ వెనక్కి తగ్గేవారు కాదు. కానీ అభ్యంతరకర సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వర్మే’ అని ఆయన అన్నారు. దీంతో ఈ నెల 24న సినిమా విడుదల కావాల్సి ఉండగా ఇంకా సందిగ్ద పరిస్ధితులే నెలకొన్నాయి.

Director Ram Gopal Varma Meets Vangaveeti Radhakrishna

- Advertisement -