ప‌్రధాని నరేంద్ర మోదీ రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే నోటి మాటతో చట్టబద్ధంగా చెలామణిలో ఉన్న నోట్లకు విలువ లేకుండా పోయే అవకాశం లేదు. దీంతో ఈ నోట్ల విలువను రద్దు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టానికి సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే బడ్జెట్ సెషన్‌లో ఈ చట్ట సవరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. నోట్ల రద్దు ప్రక్రియ ప్రకారం పాత 500, వెయ్యి నోట్ల విలువ రద్దు కావాలంటే ప్రత్యేకంగా ఓ చట్టం ఉండాలి. 1978లోనూ ఇలాగే నోట్లను రద్దు చేసినపుడు వాటి విలువ రద్దు చట్టానికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది.
అందుకే ఈసారి ప్రభుత్వం ఆర్బీఐ చట్టంలోని 26(2) సెక్షన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సెక్షన్ ప్రకారం.. ఆర్బీఐ కేంద్ర బోర్డు సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఏ బ్యాంక్ నోట్ల విలువనైనా రద్దు చేసే అవకాశం ఉంటుంది. నోట్ల రద్దు సమయానికి వ్యవస్థలో మొత్తం 15.5 లక్షల కోట్ల విలువైన కరెన్సీ ఉండగా.. ఇప్పటివరకు 12 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. మరో లక్ష కోట్ల వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.