AQI:కాలుష్యంలో ఢిల్లీకి ఫస్ట్ ర్యాంక్

3
- Advertisement -

దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులతో పోలిస్తే ఢిల్లీలోనే అత్యధిక వాయు కాలుష్యం నమోదైనట్లు థింక్ ట్యాంక్ ఎన్విరోకాటలిస్ట్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది దీపావళి వరకు (పండుగ రోజులను మినహాయించి) ఢిల్లీలో వార్షిక సగటు పీఎం 2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 94 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది జాతీయ వార్షిక సగటు 40 మైక్రోగ్రాములతో పోలిస్తే 2.3 రెట్లు అధికం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన మార్గదర్శక పరిమితి 5 మైక్రోగ్రాములతో పోలిస్తే ఏకంగా 18.7 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీ తర్వాత అత్యధిక కాలుష్యం నమోదైన రాజధానుల జాబితాలో జైపూర్ 54 మైక్రోగ్రాములతో రెండో స్థానంలో నిలిచింది. లక్నో 52, కోల్‌కతా 48, పాట్నా 47, భువనేశ్వర్ 46 మైక్రోగ్రాములతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.అలాగే డెహ్రాడూన్ 45, గువాహటి 42, భోపాల్ 42, సహారన్‌పూర్ 41 మైక్రోగ్రాముల పీఎం 2.5 సాంద్రతతో జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Also Read:ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!

వాయు కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పీఎం 2.5 వంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి, రక్తప్రవాహంలోకి చేరి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత ఈ స్థాయిలో ఉండటంతో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

- Advertisement -