ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలి!

2
- Advertisement -

తెలంగాణలో కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నాయని, తెలంగాణలోనూ వెంటనే రైతులకు పరిహారం ప్రకటించాలని కోరారు.

కరువు కోరల్లో చిక్కుకుని పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

మరోవైపు సన్న వడ్ల బోనస్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటివరకు రెండు యాసంగి సీజన్లలో సన్న వడ్లకు బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం ఎగవేసిందని ఆరోపించారు. కనీసం ప్రస్తుత వానాకాలం సీజన్‌లోనైనా సన్న వడ్లకు బోనస్ ఇస్తారా? లేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి రైతులు సన్న వడ్లు సాగు చేస్తే ఇప్పుడు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బోనస్ చెల్లించకుండా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

Also Read:AQI:కాలుష్యంలో ఢిల్లీకి ఫస్ట్ ర్యాంక్

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.2,600 చొప్పున అమ్ముకోవాల్సి వస్తోందని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ఎండిపోయిన పంటలకు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -