దేశ రాజధాని ఢిల్లీలో వాహనాలపై విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా ట్యాక్సీ, బస్సు ఆపరేటర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. కాలుష్య నియంత్రణ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని రవాణా రంగానికి చెందిన యజమానులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ ట్యాక్సీ అండ్ టూరిస్ట్ ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని వేలాది మంది ట్యాక్సీ, బస్సు యజమానులు, ఆపరేటర్లు, డ్రైవర్లు ఈ నిరసనలో పాల్గొంటారని సంఘం ప్రకటించింది.ప్రభుత్వం విధించిన బీఎస్-4 డీజిల్ బస్సులపై నిషేధం, డీజిల్ ట్యాక్సీలపై నాలుగు నెలల ఆంక్షలు రవాణా వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ సమ్రాట్ తెలిపారు. మరోవైపు భారీ ట్రాఫిక్ చలాన్లు కూడా వాహన యజమానులకు ఆర్థిక భారంగా మారాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా వాహనాల్లో పానిక్ బటన్లు, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (VLTD)లను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కూడా యజమానులకు అదనపు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలన్న నిబంధనలు చిన్న వాహనాల నిర్వాహకులకు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
Also Read:ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!
ప్రభుత్వ విధానాల కారణంగా వేలాది మంది వాహన యజమానులు, లక్షలాది మంది డ్రైవర్ల ఉపాధి ప్రమాదంలో పడుతోందని రవాణా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. తమ సమస్యలను వివరించేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు పలుమార్లు అపాయింట్మెంట్ కోరినా సరైన స్పందన రాలేదని సంఘం అధ్యక్షుడు తెలిపారు.

