తమిళ రాజకీయాలను అత్యంతగా ప్రభావితం చేసిన ఓ స్త్రీ శక్తి మంగళవారం అర్థరాత్రి కన్నుమూసింది. సెప్టెంబర్ 22న తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత..74 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి నిన్న కన్నుమూశారు. విషన్న వదనాలతో యావత్తు తమిళ జాతి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ ఇక లేరన్న మరణవార్తను ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఆమె మరణం తీరని లోటు అని నేతలు అభిప్రాయపడుతున్నారు.
జయలలిత నిన్న రాత్రి 11:30 గంటలకు తుది శ్వాస విడిచిన జయలలిత పేరిట డెత్ సర్టిఫికెట్ ను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లోని పబ్లిక్ హెల్త్ విభాగం విడుదల చేసింది. 68 సంవత్సరాల జయలలిత, చెన్నై, గ్రీమ్స్ లేన్ లోని అపోలో హాస్పిటల్స్ లో మరణించారని, తల్లి పేరు జె సంధ్య, తండ్రి పేరు ఆర్ జయరాం అని, నంబర్ 18, వేద నిలయం, పోయిస్ గార్డెన్, చెన్నై – 600086 చిరునామాతో ఈ ధ్రువపత్రం జారీ అయింది. జయ మరణ రిజిస్ట్రేషన్ నంబర్ 2016/09/111/000647/0గా పేర్కొనగా, సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ఏ సేతునాథన్ సంతకం చేశారు. ఆ డెత్ సర్టిఫికెట్ ను మీరూ చూడవచ్చు. అయితే జయలలిత డెత్ సర్టిఫికెట్‌లో ఆమె ఆధార్ కార్డు నెంబర్‌ను పొందుపరచలేదు.