వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. వరంగల్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నుంచి కాజీపేట ( వడ్డేపల్లి క్రాస్ రోడ్ ) వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైతన ఆయన ప్లాస్టిక్ రహిత సమాజ స్ధాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని…. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత 13 సంవత్సరాలుగా తాను ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉన్నవిషయాన్నిగుర్తు చేశారు. నెలలో ఒకరోజు ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని మానేస్తానని తెలిపారు.
పర్యావరణ కాలుష్యం తగ్గితే వరంగల్ ఆరోగ్య నగరంగా, హరిత నగరంగా మారుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలకు కార్పొరేటర్లు అందరూ వాహనాల్లో కాకుండా సైకిల్ పై వచ్చి హాజరవ్వాలని పిలుపునిచ్చారు.