ఇప్పటికే అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్ ‘ సినిమా చైనాలో కలెక్షన్ల వరద సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘దంగల్’ ఇప్పుడు కొత్త రికార్డును సొంతం చేసుకుంది.
ప్రపంచంలో 30 కోట్ల డాలర్ల (సుమారు రూ.1930 కోట్లు) వసూళ్లు సాధించిన ఐదో ఇంగ్లిషేతర సినిమాగా చరిత్ర సృష్టించింది. దంగల్ కంటే ముందు కేవలం నాలుగు సినిమాలే ఈ రికార్డును అందుకున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దంగల్ రూ.1936 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో చైనాలోనే రూ.1157 కోట్లు రాగా.. ఇండియాలో రూ.540 కోట్లు వచ్చాయి. దంగల్ కంటే ముందు చైనా మూవీ ద మెర్మెయిడ్ (53.3 కోట్ల డాలర్లు), మాన్‌స్టర్ హంట్ (38.6 కోట్ల డాలర్లు), ఫ్రాన్స్ మూవీ ద ఇన్‌టచబుల్స్ (427. కోట్ల డాలర్లు), జపాన్ మూవీ యువర్ నేమ్ (35.4 కోట్ల డాలర్లు) వసూలు చేశాయి. రెజ్లర్ మహావీర్ ఫోగాట్ జీవితచరిత్రపై తెరకెక్కిన దంగల్.. ఇండియాలో కంటే చైనాలోనే ఎక్కువ రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
ఇక స్పోర్ట్స్ డ్రామా చిత్రం దంగల్ కు చైనా ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. కుస్తీపోటీల్లో ప్రపంచ ఛాంపియన్లుగా తన కుమార్తెలను నిలబెట్టాలని తపించిన కుస్తీ యోదుడి నిజజీవిత గాథను అమీర్ ఖాన్ దంగల్ గా మలిచారు.
పేదరికపు హద్దులు దాటి ప్రపంచ క్రీడాయవనికలో మెరిసిన అమీర్ పెద్ద కూతురుగా నటించిన గీత పాత్రలో చైనా సమాజం తనను తాను చూసుకుందని, అందుకే దంగల్ సినిమాకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని అందుకే ‘దంగల్’ చైనాలో రికార్డుల సునామీని సృష్టిస్తోందని తెలుస్తోంది.