పెద్ద నోట్ల రద్దు ముందస్తు కసరత్తు లేకుండా చేపట్టినదనడానికి సాక్ష్యం ఎప్పటికప్పుడు మారుతున్న ప్రభుత్వ నిర్దేశనలే. డిపాజిట్లు పెరిగి డబ్బు పోగవుతున్నా నగదు ఇవ్వలేని స్థితిలో బ్యాంకులున్నాయి. లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. గ్రామీణ జన జీవనం కుంటు పడింది. రూ.1000, రూ.500 నోట్లను రద్దుచేయడం వల్ల రోజువారీగా పనులన్నీ ఆగిపోతున్నాయి. రద్దయిన పెద్దనోట్ల స్థానే రూ.100, రూ.50, రూ.20 నోట్లు సరిపడా లేకపోవడంతో చిల్లర సమస్య తలెత్తింది.
మరోవైపు బ్యాంకుల్లో నగదు కొరత.. సరిపడా నగదు లేకపోవడం సామాన్యుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెళ్లి కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి కూడా ఆంక్షలు పెట్టింది కేంద్రం. తమ డబ్బు తాము తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొద్ది రోజుల తరువాత పరిస్థితులన్నీ సర్దుకుంటాయని ఆర్బీఐ చెబుతూ వస్తుంది. అయితే బ్యాంకర్ల యూనియన్ మాత్రం దీనికి విరుద్దంగా మాట్లాడుతోంది.
దేశవ్యాప్తంగా నాలుగు నగదు ముద్రణా కార్యాలయాలు వాటి పూర్తి స్థాయి సామర్ధ్యంతో పనిచేసినా కొరత ఏర్పడవచ్చని బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ) తెలిపింది. మరో నాలుగు, ఐదు నెలల పాటు బ్యాంకుల్లో నగదు కొరత కొనసాగే అవకాశం అంచనావేసింది. మరోవైపు వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు పంపిణీలో సమస్యలు తలెత్తవచ్చని దీంతో ప్రజలు మరింత అసహనానికి గురవుతారని పేర్కొంది.
ఈ విషయంపై బీఈఎఫ్‌ఐ జనరల్ సెక్రటరీ పీకే.బిస్వాస్ మాట్లాడుతూ.. నాలుగు కరెన్సీ ముద్రణా సంస్థలు వాటి సామర్థ్యం మేర కరెన్సీని ముద్రిస్తున్నప్పటికీ నగదు కొరత కొద్ది రోజుల పాటు కొనసాగుతుందని నగదు పంపిణీ సాధారణ స్థితికి చేరుకునేందుకు సుమారు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. కొంతమంది వినియోగదారులు బ్యాంకులను ధ్వంసం చేయడం వల్ల కొన్ని చోట్ల బ్యాంకు కార్యకలాపాలకు ఆగిపోయాయని అన్నారు.
మరోవైపు లెక్కల్లో చూపించని మొత్తాలను బ్యాంకుల్లో జమ చేస్తున్నవారిపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత నిర్ణీత పరిమితికి మించి బ్యాంకుల్లో జరుగుతున్న ఇలాంటి డిపాజిట్లపై 60% మేర ఆదాయపు పన్ను విధించబోతున్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.