కరోనా టీకాల విషయంలో భారత్ బయోటెక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు భారత్ బయోటెక్ ఇటీవలే భారత ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించింది. నిపుణుల కమిటీ సిఫారసులు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
డీసీజీఐ అనుమతి నేపథ్యంలో చిన్నారుల కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సన్నద్ధమవుతోంది. అయితే, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలంటే, రెండో దశ క్లినికల్ పరీక్షల డేటాను భారత్ బయోటెక్ వర్గాలు కేంద్ర ఔషధాల ప్రమాణ స్థాయి సంస్థ (సీడీఎస్ సీఓ)కు సమర్పించాల్సి ఉంటుందని డీసీజీఐ స్పష్టం చేసింది. ఈ ట్రయల్స్ 252 మంది వలంటీర్లపై భారత్ బయోటెక్ కంపెనీ నిర్వహించనుంది. ట్రయల్స్‌లో భాగంగా 28 రోజుల్లోపు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయనున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్, నాగాన్‌పూర్ మెడిట్రినా సంస్థలో జరుగనున్నాయి.