రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు: మంత్రి ఎర్ర‌బెల్లి

133
minister errabelli
- Advertisement -

రైతులు పండించిన వ‌రి ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని, రైతులు ఏ విధ‌మైన ఆందోళ‌న‌లు చెంద‌వ‌ద్ద‌ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. పాల‌కుర్తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ధాన్యం కొనుగోళ్లు, కోవిడ్ బాధితుల స్థితిగ‌తుల‌ను తెలుసుకునేందుకు గురువారం మంత్రి టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో చేతులెత్తేసినందున దేశంలోని ఏ రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదని అన్నారు.

రైతు ప‌క్ష‌పాతి, రైతుల సంక్షేమ‌మే ప్ర‌ధాన‌మ‌ని భావించే మ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఆదేశంతో రైతులు పండించిన‌ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా రుణం తీసుకొని ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని, ఈ విష‌యం రైతులు ఏ మాత్రం దిగులు ప‌డ‌కుండా మ‌నోధైర్యంతో ఉండాల‌ని ఆయ‌న కోరారు. ఈ విష‌యాన్ని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు రైతుల దృష్టికి తీసుకెళ్లాల‌ని మంత్రి కోరారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

కోవిడ్ బాధితులు ధైర్యంగా ఉండాలి..
పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం దాదాపు 2వేల యాక్టీవ్ క‌రోనా కేసులు ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. క‌రోనా బాధితులు త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి, ఇమ్యూనిటీ పెంపొందించుకునేందుకు డ్రై ఫ్రూట్ కిట్స్ పంపిణీ చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. కిట్స్ క‌రోనా బాధితుల‌కు తాము ఉచితంగా అంద‌జేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉన్న వాలంటీర్లు, టిఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల ద్వారా డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేస్తామ‌ని మంత్రి తెలిపారు. కోవిడ్ బాధితుల చికిత్స‌కు అవ‌స‌ర‌మ‌య్యే రెమిడిసివీర్‌, విట‌మిన్-సి, యాంటిబ‌యాటిక్స్ ఔష‌దాల‌కు కొర‌త లేద‌ని మంత్రి తెలిపారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా నిరంత‌రంగా ఆసుప‌త్రులకు అందే విధంగా కృషి చేస్తున్న‌ట్లు మంత్రి ద‌యాక‌ర్‌రావు తెలిపారు.ఈ టెలికాన్ఫ‌రెన్స్‌లో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, తదిత‌రులు పాల్గొన్నారు

- Advertisement -