తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాటి ధరలను కూడా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200 అని, వెంటిలేటర్ అవసరం లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500 తీసుకోవాలని, ఒకవేళ రోగి వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9,000 తీసుకోవాలని చెప్పారు. అలాగే ఐసోలేషన్ కు 4000 గా ఫీజు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అయితే, కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని తాము మార్గదర్శకాలు ఇస్తున్నామని ప్రకటించారు. టెస్టుల వివరాలు ప్రభుత్వానికి అందించాలి. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు, పరిస్థితులను తెలుసుకునేందుకు తాను ఉన్నతస్థాయి సమీక్షలు ప్రతి రోజు నిర్వహిస్తున్నానని మంత్రి ఈటెల చెప్పారు. తెలంగాణలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు.
కరోనా కట్టడికి పని చేస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తామని.. కంటైన్మెంట్ పదానికి అర్థం చెప్పింది తెలంగాణ రాష్ట్రమన్నారు. శాస్త్రీయంగా, క్షేత్ర స్థాయి అనుభవాలతో పని చేస్తున్నాము. హైదరాబాద్ చుట్టూ కరోనా వ్యాప్తి తెలుసుకోవడానికి 30 నియోజకవర్గాల్లో పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటెల తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతి ఇంటిని సర్వే చేస్తాము, దీనికోసం అదనంగా సిబ్బందినీ తాత్కాలికంగా నియమించు కోవడానికి సీఎం అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో 17000 వేల పడకలు ప్రభుత్వంలో అందుబాటులో ఉన్నాయి. రోజుకి 4వేల మందికి టెస్ట్ చేసే అవకాశం ఉంది, మరో కొత్త పరికరం తీసుకువస్తున్నాము. ఫలితంగా మరో 3500 మందికి టెస్ట్ చేయగలమని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి రావడానికి ఇష్టపడని వారి కోసం ప్రైవేట్‌లో అనుమతులు ఇచ్చాము. వారం పది రోజుల్లోపు రాష్ట్రంలో 50 వేల టెస్టులు చేస్తామని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.
ప్రైవేట్ లాబ్‌లో కరోనా పరీక్షలకు ధరలు ఇవే..
– కరోనా పరీక్షలు 2200/-.
– ఐసోలేషన్ కు 4000/-
– ఐసీయు వేటిలేటర్ అవసరం లేకుంటే 7500/-
– వెంటిలేటర్ అవసరం ఉంటే – 9000/- గా నిర్ణయించారు.