కరోనా వ్యాప్తి.. ప్రజలకు, మీడియాకు సూచనలు..

466
corona
- Advertisement -

మానవాళి కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అని తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రబలుతున్నది. ఇటువంటి క్లిష్టతరమైన సమయంలో ప్రభుత్వాలు, ప్రజలు ఈ వైరస్ మరియు వ్యాధి గురించి అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ ప్రయత్నంలో సాంప్రదాయ సమాచార, వార్తా సంస్థలతో పాటూ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్ చాట్, టిక్ టాక్ వంటి అనేక సామజిక మాధ్యమాలు, ఇంకా వెబ్సైట్లు, మొబైల్ అప్స్ వంటి ఇతర డిజిటల్ మాధ్యమాలను మనం ఉపయోగిస్తున్నాము.

అయితే అతివేగంగా ప్రపంచమంతా ఈ కొత్త వైరస్ సోకుతుండడంతో సాధికారిక, ప్రామాణిక సమాచారం ఇంకా ఆశించినస్థాయిలో అందుబాటులో లేదు. అందువల్ల కొంతమంది తమ అవగాహనా లోపం వల్ల, లేదా ఆకతాయితనం వల్ల అనేక రకాల తప్పుడు సమాచారాన్ని, వదంతుల్ని వ్యాపింప చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారం, వదంతులు కూడా మరొక మహమ్మారిగా తయారై సాధారణ ప్రజలకి, ప్రభుత్వ యంత్రాంగానికి మరో సవాలుగా పరిణమిస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)బాధ్యతారహితమైన ఈ విచ్చలవిడి తప్పుడు సమాచార, వదంతుల వ్యాప్తిని Infodemic గా అభివర్ణించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరులకు డిజిటల్ మీడియా విభాగం కింది సూచనలు చేస్తున్నది..

-డిజిటల్ మాధ్యమాలలో మీకు వచ్చిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు బాధ్యతతో వ్యవహరించండి, కొంచెం జాగ్రత్త వహించండి.

-సమాచార ప్రామాణికతను రూఢి చేసుకోకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ సమాచారాన్ని ఇతరులకు చేరవేయవద్దు.

-వాట్సాప్ వంటి వేదికలలో బృంద సభ్యులు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తే ఆ బృందపు అడ్మిన్స్ దానికి బాధ్యులవుతారు. చట్టపరంగా విచారణను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

– డిజిటల్ మాధ్యమాలను ఇప్పుడిప్పుడే వాడుతున్న వారు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం లేని వారి విషయంలో మనం మరింత దృష్టి పెట్టాలి. వారికి ఆ మాధ్యమాలకున్న బలం, బలహీనతలు, పరిధులు,
-పరిమితులు, అనుకూల, ప్రతికూలతల గురించి వివరంగా చెప్పాలి. వాటి దురుపయోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కలిగించాలి.

-కరోనా మహమ్మారి విషయంలో అనేక రకాల తప్పుడు సమాచారం వ్యాపిస్తున్నది. ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిగత వివరాల గోప్యత అత్యంత ముఖ్యమైన అంశం. వ్యాధి బారిన పడిన వ్యక్తుల గురించి ఎవరు సమాచారం పంపినా దాన్ని మీరు ఇతరులకు పంపకండి. మొదటగా ఆ సమాచారం ప్రామాణికమైనది కాకపోవచ్చు, ఒక వేళ అది ప్రామాణికమైనదైనా అది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించవచ్చు. ఇది అనైతికమే కాదు శిక్షార్హమైన నేరం కూడా.

-విపత్తుల విషయంలో వదంతులను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే వారికి విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష ఇంకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంకా ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం కూడా తప్పుడు సమాచార ప్రచారం శిక్షార్హమౌతుంది.

-కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం, 1897 కింద తెలంగాణ అంటువ్యాధులు (కోవిడ్-19) నిబంధనలను విడుదలచేసింది. ఈ నిబంధనలలోని 10వ సెక్షన్ ప్రకారం కరోనా వైరస్ కు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా సంబంధిత అధికారులతో ధృవీకరించుకోకుండా వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు, సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి చేయకూడదు. దీనికి విరుద్ధంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని ఎవరైనా వ్యాప్తి చేస్తే సంబంధిత చట్టాల కింద శిక్షార్హులవుతారు.

-ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రామాణిక సమాచారం అందరి అవసరం. కరోనా మహమ్మారిపై సమరంలో అది చాలా కీలకం కూడా. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించే వారు ఏ సమాచారం, వార్త ప్రామాణికతపై సందేహం వచ్చినా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే సమాచారం, ప్రధాన స్రవంతి వార్తా మాధ్యమాలు ప్రచురించే, ప్రసారంచేసే సమాచారంతో పోల్చి సరిచూసుకోవాలి.

సమాచార మాధ్యమాలకు డిజిటల్ మీడియా విభాగం సూచనలు..

1. కరోనా వంటి మహమ్మారిని రూపుమాపడంలో సమాచార మాధ్యమాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ కి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసే మహత్తర బాధ్యతను అవి నిర్వర్తిస్తున్నాయి. మీకు, మీ సిబ్బందికి ధన్యవాదాలు.

2. అయితే సామాజిక మాధ్యమాలలో వ్యాప్తిలో ఉన్న సంచలనాత్మక, భయాందోళనలకు గురిచేసే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కొన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికల ఆన్లైన్ ఎడిషన్లు, వెబ్ మ్యాగజీన్లు, ఆన్లైన్ న్యూస్ సైట్లు యధాతథంగా ప్రచురిస్తున్నాయి. అట్లే, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నాయి.

3. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చాలా వార్తలను తప్పుదోవ థంబ్ నెయిల్స్ (thumbnails)తో పోస్ట్ చేస్తున్నాయి. సంబంధిత వార్తకు, సమాచారానికి సంబంధం లేని ఈ థంబ్ నెయిల్స్ వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, సమాచారాన్నీ కలుషితం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అవహేళన చేసే విధంగా, వారిపై చులకన భావం కలిగించేదిగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ఈ వీడియోలు ఉండడం విచారకరం. ఇది అనైతికమే కాదు ఆ డిజిటల్ మాధ్యమాల నిబంధనలకు విరుద్ధం.

4. పదే పదే ఇటువంటి తప్పుదోవ పట్టించే వార్తలు, వీడియోలని ప్రచురించే, ప్రసారం చేసే వేదికలపై డిజిటల్ మీడియా విభాగం సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థల దృష్టికి తీసుకెళ్లి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇటువంటి వార్తలు, వీడియోలను పోస్టు చేస్తున్న ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల కు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేసే అవకాశం ఉంటుంది. తరచుగా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే చానెళ్లను ఆ సామాజిక మాధ్యమ సంస్థలు పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంది.

5. పైగా ఇటువంటి వార్తలు, వీడియోలు తెలంగాణ అంటు వ్యాధులు (కోవిడ్-19) నిబంధనలు, విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్, ఐపీసీ సెక్షన్ 505 కింద ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి. పై చట్టాలే కాకుండా ఇతర నిబంధనలను అనుసరించి ఆ సంస్థలు/ సంస్థల యజమానులు శిక్షార్హులవుతారు.

6.కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు డిజిటల్ మీడియా వేదికలు అత్యంత ప్రయోజనకారి అవుతాయి. అనేక వార్తా సంస్థలు, సమాచార మాధ్యమాలు డిజిటల్ మాధ్యమాలను అత్యంత ప్రభావవంతంగా సమాజహితం కోసం వాడుతున్నాయి. వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి, అంతిమంగా విజయం సాధించడానికి సామాన్య ప్రజలు, సమాచార, వార్తా సాధనాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన సమయమిది. ఇది సమిష్టిగా చేయాల్సిన ప్రయత్నం, ఇది ఖచ్చితంగా గెలవాల్సిన యుద్ధం!

పై విషయమై ఏవైనా సందేహాలున్నా లేదా మరింత సమాచారం కోసం సంప్రదించండి:

దిలీప్ కొణతం
సంచాలకులు, డిజిటల్ మీడియా
ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్ల శాఖ
తెలంగాణ ప్రభుత్వం
ఈమెయిల్: dir_dm@telangana.gov.in

- Advertisement -