లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో తలెత్తిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలను రేపు సూర్యపేటలో నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు జరగనుండగా అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట మండలం కసరాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఆర్మీ అధికారులు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షిస్తున్నారు.
సంతోష్ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటలకు తీసుకురానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలిస్తారు. పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలోనే సంతోష్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.