రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు సీఎం కేసీఆర్. ఎన్ని అవరోధాలు ఎదురైనా విజయాలను సాధించామని అన్నారు. ఈ రోజు(శుక్రవారం) టీఆర్ఎస్ 17వ ప్లీనరీ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధికోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలు ఎన్నో కేసులు పెట్టాయని, కానీ ప్రాజెక్టులపై పెట్టిన కేసులను గెలిచామని, చరిత్రలో ఏ ప్రాజెక్టు కూడా ఇన్ని అనుమతులను సాధించలేదన్నారు.
సీతారామ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని, వలస వెళ్ళిన పాలమూరు వాపస్ వస్తోందని అన్నారు. రైతులను నిర్ణీత పద్దతుల్లో పంటలు వేయడినికి, రైతు సమన్వయ సమితిలు కృషి చేయాలని అన్నారు. మే 10 నుంచి పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ జరుగుతుందని, చెక్కుల పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బంది రావొద్దని వెల్లడించారు కేసీఆర్.
అంతేకాకుండా తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసమైన వారికి కళ్ళజోడు అందిస్తామన్నారు. తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్ పేరుతో అందరికీ వైద్య పరీక్షలు, తెలంగాణ వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే..ఎవరో అవాకులు, చెవాకులు పెడితే పట్టించుకోవద్దని, తెలంగాణ ప్రజలే మనల్ని కాపాడుకుంటారని అన్నారు. అంతేకాకుండా ఆరు నూరైనా.. కోటి ఎకరాలకు నీరు పారాలని..ఆకుపచ్చ తెలంగాణ కావాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ను అందిస్తున్నామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ,ఇన్వర్టర్ల దుకాణాలు మాత్రమే దివాళాతీశాయని తెలిపారు.
వచ్చే రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఉంటుందని, హైదరాబాద్‌లో నీళ్ళ కరువు లేకుండా చేశామని వెల్లడించారు. కాగా.. భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా చేశామని, ఒక్కరూపాయి కూడా లంచం లేకుండా రిజిష్ట్రేషన్ జరుగుతుందని అన్నారు. తెలంగాణలో పేకాట క్లబ్బులు లేవని,గుడుంబా అడ్రెస్ లేకుండా పోయిందని అన్నారు. గొర్రెల పంపిణీతో రూ.వెయ్యి సంపదను సృష్టించామని,అలాగే మత్సకారులకు మర బోట్లు ఇవ్వనున్నట్లు, ఎటువంటి పక్షపాతం లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు.
కాగా.. మీడియా తప్పుడు రాతలు రాయొద్దని, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులను బలహీనవర్గాలకు కేటాయిస్తామని తెలిపారు.