ఇల్లందు టీఆర్ఎస్ అభ్యర్ధి కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన ఇల్లందులోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గోన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఇల్లందులో అండర్ గ్రౌండ్ మైన్ ను ప్రారంభిస్తామని హామి ఇచ్చారు. మొదట బొగ్గును ఇక్కడే కనిపెట్టారని చెప్పారు. ఇల్లందు ప్రాంతం ఆర్ధికంగా వెనకబడి ఉన్నప్పటికి రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతమని చెప్పారు.
ఎన్నో కష్టాలు పడి తెలంగాణ సాధించుకున్నాం.అదే విధంగా అన్ని విధాలుగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. అన్ని ఆలోచించి ఓటెయ్యాలి. గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంత అభివృద్ది ఎందుకు చేయలేకపోయాయి. 57ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు ఎంచేశాయో మీకు తెలుసు.. గత నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది మీముందు ఉంది. మన అవసరాలకు సరిపోను ఇతరులకు కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది.
సంక్షేమ పథకాలలో దేశంలోనే నెం1 స్ధానంలో ఉన్నామని చెప్పారు. మనం ఎప్పుడన్న కలగన్నమా కళ్యాణ లక్ష్మీ పథకం వస్తుందని, 24గంటల కరెంట్ వస్తుందని ఉహించినమా అని అన్నారు. రైతులకు ఉపయోగపడేలా రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టుకున్నాం. ఇల్లందు మరింత అభివృద్ది చెందాలంటే కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.