రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లెలు పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్దులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సిఎం స్పష్టం చేశారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని.. అదనపు కలెక్టర్లకు డిపివోలకు సిఎం మరోసారి తేల్చి చెప్పారు.
జూన్ 20 న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలుంటాయని సిఎం తెలిపారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో సిఎం కెసిఆర్ ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవఖానకు శంఖుస్థాపన చేయనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించే క్రమంలో అప్పటికప్పుడు కొన్ని అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రతీ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు 25 లక్షల రూపాయలను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమావేశం ముగిసేలోపే ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోను అడిషనల్ కలెక్టర్లకు అందించారు.
వైద్యం ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం :
కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. ఇటీవలె 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. వరంగల్లులో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను, 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సిఎం తెలిపారు. అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం దవాఖానా బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ ను నిర్మించాలన్నారు. కెనడామోడల్ లో,ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముండాలని, వైద్యాధికారులను సిఎం ఆదేశించారు. అందుకు కెనడా పర్యటించి రావాలన్నారు.
ఆదివారం ప్రగతి భవన్ లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల (డిపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా వారు చేరుకున్న లక్ష్యాలను సిఎం సుధీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో… మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే లు హన్మంతు షిండే, విద్యాసాగర్ రావు, చిరుమర్తి లింగయ్య, పట్నం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎం ఓస్డీలు ప్రియాంక వర్ఘీస్, గంగాధర్, వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, మున్సిపల్ డైరక్టర్ సత్యనారాయణ, లతో పాటు పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, అటవీ శాఖ, వైద్య అధికారులు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డిపివోలు పాల్గొన్నారు.
క్షమించే ప్రసక్తేలేదు :
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ..‘‘ పల్లెలు, పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే క్రమంలో అదనపు కలెక్టర్లు, డీపీవోలు కష్టపడి పనిచేస్తున్నరు. ఇందులో కాదనేదేమీ లేదు. అయితే ఆశించినంత పని జరుగుతలేదని క్షేత్రస్థాయినుంచి నాకు నివేదికలు అందుతున్నయి. అందుకే నేను మీకు పదే పదే చెప్పవలసి వస్తున్నది. మీకు కావలసినంత సమయం ఇచ్చిన తర్వాతనే నేను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాను. దానికి ముందు మరోసారి మీతో మాట్లాడి మీ అభిప్రాయాలను కూడా తీసుకుందామని నేటి సమావేశాన్ని ఏర్పాటు చేశాను. చెప్పకపోతే నాది తప్పు. ఇంత చెప్పినంక కూడా ఇంకా ఎవరైన అదనపు కలెక్టర్లు డిపీవోలు వారి వారి పనితీరును మెరుగుపరుచుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకుండా, అలసత్వం వహించి, నిర్దేశిత బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు గనుక నా తనిఖీల సందర్భంగా నిరూపణ అయితే ఇక ఎవరు చెప్పినా వినను. క్షమించే ప్రసక్తే లేదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి.’ అని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. తన పర్యటనకు ఇంకా పదిరోజుల సమయం ఉన్నందున ఈ లోపు ఏవైనా తప్పొప్పులుంటే సరిదిద్దుకోవాలని సూచించారు.గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులను, సర్పంచ్ లను సస్పెండ్ చేయాలని, ఈ విషయంలో అధికార పార్టీ అని కూడా చూడొద్దని, టిఆర్ఎస్ సర్పంచులు తప్పు చేస్తే ముందు వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.
సేవ్ ద విలేజ్….సేవ్ యువర్ సెల్ప్ :
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఢబ్బయేండ్లు దాటినా పల్లెలు పట్టణాల్లో ఆశించనమేరకు అభివృద్ధి చోటుచేసుకోకపోవడం పట్ల సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మొదటినుంచి నిర్లక్ష్యానికి గురవుతుండడం శోచనీయమన్నారు. ఇందుకు అధికార యంత్రాంగం మానసిక ధోరణికూడా ప్రబలకారణమని సిఎం అభిప్రాయపడ్డారు. పాతపద్దతులను వదిలి, నిత్యనూతనంగా ప్రజాక్షేత్రంలో మమేకమై, గ్రామాభివృద్ధికోసం తమకు అందివచ్చిన గొప్ప అవకాశాన్ని యువ కలెక్టర్లు అందిపుచ్చుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. మూస ధోరణులు వైఖరులను మార్చుకొని సామర్ధ్యాన్ని పెంచుకొని పట్టుదలతో కృషిచేసి గొప్పపేరుతెచ్చుకోవాలని కోరారు.
తమకోసం పనిచేసే ఆదర్శవంతమైన కలెక్టర్లను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోదాహరణలతో వారికి పలువురు ఆదర్శవంతంగా పనిచేసిన గత కలెక్టర్ల పేర్లను సిఎం ఉదహరించారు. గ్రామ సభలు నిర్వహించి, గ్రామ ఆర్ధిక నివేదికల మీద చర్చలు చేపట్టేలా చర్యలుతీసుకోవాల్సిన బాద్యత డిపీవోలదేనని సిఎం స్పష్టం చేశారు. గ్రామ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, కరెంటు బిల్లుల చెల్లింపు,ట్రాక్టర్ కిస్తీల చెల్లింపు,గ్రీన్ కవరేజీ కోసం ఖర్చు….అనే అంశాలు ‘చార్జుడు అకౌంట్’ కిందికి వస్తాయని, వీటికి ముందు నిధులు కేటాయించిన తర్వాతే మిగతా వాటికి చెల్లించాలని..సీఎం స్పష్టం చేశారు. పల్లె ప్రకృతి వనాలకోసం ప్రభుత్వ భూమి దొరకని పక్షంలో గ్రామ నిధుల నుంచి ప్రయివేట్ భూమిని కొనుగోలు చేయాలని సూచించారు.
నిరంతరం డిపీవోలు డిఎల్పీవోలు ఎంపీడీవో లతో సమావేశాలు నిర్వహించాలని, అలసత్వం వదిలి నిత్యం గ్రామాభివృద్ధిమీదనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ‘సేవ్ ద పీపుల్ సేవ్ ద విలేజెస్ సేవ్ యువర్ సెల్ప్’’ (ప్రజలను, గ్రామాలను కాపాడండి..మిమ్మల్ని మీరు కాపాడుకోండి ),అని అదనపు కలెక్టర్లు డీపీవోలకు సిఎం స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేనప్పుడు షోకాజ్ నోటీసులు పంపడమే కాదు, తర్వాత వాటి మీద తాత్సారం చేయకుండా చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు.
నీను కూడా ఓ జిల్లాను దత్తత తీసుకుంట…పని ఎట్ల జరగదో చూస్త :
అన్ని అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించినా కూడా, నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించకోపోవడం నేరమని సిఎం అధికారులను ఉద్దేశించి స్పష్టం చేశారు. ‘‘ నేల విడిచి సాము చేయడం అనేది మనకు అలవాటయ్యింది. మన పక్కన్నే చేయవలసినంత పని వున్నది. అది వొదలి ఎక్కన్నో ఏదో చేయాలనుకోవడం సరికాదు. ఆరునెల్ల పాటు కష్టపడండి. గ్రామాలు,పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలం..’’ అని సిఎం అన్నారు. ‘‘ నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంట. అదనపు కలెక్టరు నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం.’’ అని సిఎం స్పష్టం చేశారు.
నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ :
సర్పంచులకు కిందిస్తాయి ఉద్యోగులకు తెలియని విషయాలను నేర్పిస్తూ, వారి సామర్ధ్యాలను పెంచుతూ వారిని గ్రామాభివ్రుద్దిలో భాగస్వాములను చేయాలని అదనపు కలెక్టర్లకు డిపివోలకు సిఎం వివరించారు. ‘‘ మొదటి దశలో సర్పంచులు తదితర సిబ్బందితో ప్రేమగా ఉండండి, మంచిగ చెప్పండి, సముదాయించి చెప్పండి అభిమానంతో పనిచేయించుకోండి. వినలేదనుకో కొంచెం కఠినంగా మారండి. ఎందుకంటే… ‘‘ నయమున ప్రాలుందాగరు, భయమున విషమైన భుజింతురు’’ అని అంటరు. అంటే..మంచిగా నిమ్మలంగా బతిమాలి చెప్తే కూడా కొన్ని కొన్ని సార్లు వినరు…అప్పుడు నర్సింహావతారం ఎత్తక తప్పదు..’’ అని వివరిస్తూ పనితీరు మెరుగుపడడానికి సర్పంచులు, కిందిస్థాయి అధికారులతో కాస్త కఠినంగా కూడా వ్యవహరించాలని సిఎం వారికి హితబోధ చేశారు.గ్రామాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచిందని కేరళ పర్యటనకు కొంతమంది అదనపు కలెక్టర్లను డీపీవోలను ఎంపిక చేసి పంపించాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. ఢిల్లీ తమిళనాడు ప్రభుత్వాలు అమలు పరుస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకున్నదని , నేర్చుకోవడం నిరంతర ప్ర్రక్రియ అని తెలియని విషయాలను తెలుసుకోవడానికి అహంభావం కూడదని సిఎం హితవు పలికారు.
ఎస్. కే.డే ఆశయ సాధనకు కృషి చేద్దాం :
దేశస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎస్ కె డే మార్గదర్శకత్వంలో ఒక ఉద్యమంలా రూపుదిద్దుకున్న కమ్యునిటీ డెవలప్ మెంట్(సీడీ) కార్యక్రమం, ఆ తర్వాత క్రమంలో పంచాయతీరాజ్ ఉద్యమంగా ప్రారంభమైందని అదే తరహాలో కోఆపరేటివ్ మూవ్ మెంట్ కూడా పురుడుపోసుకున్నదని సిఎం అన్నారు. కాగా రాను రాను పంచాయతీరాజ్ వ్యవస్థను పొలిటికలైజేషన్ కు గురి చేసి అక్కడితో ఆగకుండా డిపార్ట్మెంటలైజేషన్ చేసి దాన్ని కంపార్ట్మెంటలైజేషన్ చేసి ఎస్ కె డే కలలు గన్న స్పూర్తిని దెబ్బతీసారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో ఇప్పటికే ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటూ ప్రగతిపథంలో సాగిపోతున్న పంచాయతీరాజ్ వ్యవస్థను ఎస్ కె డే ఆశయాలకు అనుగుణంగా మరింత గొప్పగా తీర్చిదిద్దే బాధ్యతను యువ అదనపు కలెక్టర్లు తమ భుజాలమీదికెత్తుకోవాలని, పల్లె ప్రగతి పథంలో డిపివోలను తమ వెంట నడిపించుకు పోవాలని మరోమారు సిఎం పిలుపునిచ్చారు.
మీ వెంట సిఎం కెసిఆర్ వున్నడు :
అధికారులు నిర్భీతిగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని , ఎవరో వత్తిడి చేస్తున్నరనే మాట వినపడకూడదని స్పష్టం చేశారు.‘‘ మీ పని మీరు సమర్థవంతంగా చేయండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.మీ వెంట సిఎం కెసిఆర్ వున్నడనే ధైర్యంతో పనిచేయండి..’’ అని అధికారులకు సిఎం స్పష్టం చేశారు.‘‘ అసాధ్యమనేది ఏదీ వుండదు. గట్టిగా తలుచుకోవాలె.మనకు పల్లెలు పట్టణాల అభివృద్ధిని మించిన మరోపనిలేదు,. అవసరమైతే మీరు పల్లెల్లో పర్యటనలు చేపట్టాలె. రాత్రిల్లు బస చేసి పొద్దున లేచి జనంలో తిరుగాలె. అప్పుడు మాత్రమే మనకు క్షేత్రస్థాయి కష్టాలు అర్థమైతయి.వాటికి పరిష్కారాలను మీరు కనుగొనగలుగుతరు. మీరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడానికి నూతన వాహనాలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాం. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలకోసం నెల నెలా క్రమం తప్పకుండా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నది. పంచాయితీరాజ్ వ్యవస్థలో వొక్కపోస్టు కూడా గంటపాటుకూడా ఖాళీ లేకుండా నూటికి నూరు శాతం ఖాళీలను పూర్తిచేసుకున్నం. ఆర్ధిక వనరులున్నయి, ఉద్యోగ వ్యవస్థ ఉన్నది, ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా నిలుస్తున్నది.., ఇంకేంగావాలె ? ఏ ప్రభుత్వమైనా ఇంతకన్నా ఎక్కువగా ఏం చేయగలుగుతుంది ? కాబట్టి, మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ చర్యలకు గురికావద్దు అని మరోమారు సిఎం స్పష్టం చేశారు. పర్సనల్ అప్రేజల్ రిపోర్టును (పీఏఆర్) తయారు చేయడం ద్వారా కలెక్టర్ల పనితీరును రికార్డు చేస్తామని సిఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో గ్రామ పంచాయితీ కార్యదర్శి పోస్టు వొక్క గంట కూడా ఖాళీ వుండకూడదని ఎక్కడ అవసరముందో అక్కడ తక్షణమే నింపుకునే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చిన విషయాన్ని సిఎం గుర్తుచేశారు. ఎంపీవోలకు వోరియెంటేషన్ కోసం క్లాసులు నిర్వహించాలని సూచించారు.
అదనపు కలెక్టర్లకు తగురీతిలో గౌరవం :
తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటయిన అనతికాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయిలో అనేక రకాలుగా గ్రామీణ పట్టణాభివృద్ధి పథకాలను కార్యక్రమాలను అమలు పరుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సిఎం తెలిపారు. అయితే..యేదో సాధించినామని తృప్తి పడి,అక్కడితే ఆగిపోవడం సరికాదని సిఎం పేర్కొన్నారు. కలెక్టరు అనే పదాన్ని పదే పదే చట్టంలో రూపొందించింది అదనపు కలెక్టర్లును దృష్టిలో ఉంచుకొనే అని సిఎం తెలిపారు. జిల్లా కలెక్టరు కార్యాలయాల్లో కలెక్టరు ఆఫీసు రూం పక్కన్నే అదనపు కలెక్టర్ల రూం ను ఏర్పాటు చేసి వారికి ప్రోటోకాల్ గౌరవాన్నిమరింత పెంచుతామన్నారు. ‘‘ పని ఎత్తుకుంటే ఏదో చేసినమంటె చేసినం అన్నట్టుగా డ్రై గా చేయకూడదు. మనసు పెట్టి రసాత్మక హృదయంతో పనిలో లీనమై చేయాల’’ని సిఎం సూచించారు. అప్పుడే సరియైన ఫలితాలను రాబట్టగలమని స్పష్టం చేశారు.
మొక్కలు నాటే పని పూర్తిచేయాలె :
ప్రారంభించిన పది పదిహేనురోజుల్లో అన్ని గ్రామాలు పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను పూర్తిచేయాలని సిఎం అటవీశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో వందకు వందశాతం నర్సరీలు మొక్కల పెంపకం కార్యక్రమం జరుగుతున్నదని అధికారులు వివరించగా వారిని సిఎం అభినందించారు. ‘‘మంచిగ పనిచేసినోల్లను గుర్తించి అవార్డులు రివార్దులు అందచేయాలని సూచించారు.వైకుంఠధామాలకు కాంపౌండు గా గోడలను కాకుండా గ్రీన్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలన్నారు. దట్టమైన పచ్చని పెద్ద పెద్ద చెట్లతో రక్షణఏర్పాటు చేయాలనితెలిపారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ నిధులే కాకుండా.. స్వచ్చంద సంస్థలు తదితర మార్గాలద్వారా నిధులను సమీకరించుకొని అత్యంత సుందరంగా వైకుంఠధామాలను తీర్చిదిద్దుకుంటున్నరనే విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు సిఎం కు వివరించారు. అందుకు సిఎం అభినందించారు.గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత బాధ్యతను, గ్రామ సర్పంచి తీసుకోవాలని, మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాసంబంధ సంస్థల పారిశుధ్య బాధ్యతను మున్సిపాలిటి పాలకవర్గాలు తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. ఇందుకు గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఢబ్బయేండ్లయితున్నా చనిపోతే ఎక్కడ దహన సంస్కారాలు చేయాల్నో తెలియని దుస్థితిలో ఈ దేశమున్నదని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైకుంఠధామాలను నూటికి నూరు శాతం నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.
అంశాల వారిగా పురోగతిపై సమీక్ష :
సమీక్షాసమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాల వారిగా అంశాలవారిగా ప్రగతి పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయితీ రాజ్ కార్యదర్శి , అన్ని జిల్లాల్లో అంశాలవారిగా పురోగతిని చదివి వినిపించారు. వైకుంఠధామాల నిర్మాణాలు, ప్రకృతి వనాల నిర్మాణం, డంపు యార్డుల నిర్మాణం సహా ఇతర అంశాల నిర్మాణాలను పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్లు కొన్నారా? కిస్తీలు చెల్లిస్తున్నరా? కరెంటు బిల్లులు కడుతున్నారా ? పారిశుధ్యం, చెత్తసేకరణ, పచ్చదనం, మంచినీటి సరఫరా, మొక్కల స్థితి ఏ జిల్లాలలో ఎలా వున్నది అని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు బతికిన శాతం, గ్రామసభలు నిర్వహించిన తీరు, స్థానిక ఎంపీవోలు పాల్గొంటున్నతీరు, అందులో వారు గ్రామ ప్రగతి కోసం తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. చెత్తసేకరణ, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరుబావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య నిర్వహణ, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డ్రైనేజీలు శుభ్రం చేయడం వంటి అంశాలను పేరు పేరు నా వివరాలు తీసుకున్న సిఎం., ఈ అంశాల్లో పురోగతిని అనుకున్న రీతిలో సాధించకుండా, వెనకబడిన జిల్లాల్లో తక్షణమే నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
వైద్యారోగ్యశాఖ నివేదిక :
ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులు జిల్లాల తెలంగాణలో సీజనల్ వ్యాధుల వివరాలు అవి సంక్రమించే తీరు వాటి నివారణకోసం చేపట్టవలసిన చర్యలను వివరించారు. మలేరియా తదితర సీజనల్ వ్యాధుల కట్టడిలో దేశంలోనే తెలంగాణ ముందంజలో వున్నదని సిఎం కు తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా తెలంగాణలో వైరల్, సీజనల్ వ్యాధులను గణనీయంగా అరికట్టగలిగామని, అందుకు సంబంధించిన గణాంకాలతో కూడిన నివేదికను సమావేశంలో వైద్యాధికారులు చదివి వినిపించారు. మలేరియాలో ప్రిఎలిమినేషన్ దశ నుంచి ఎలిమినేషన్ (నిర్మూలన) దశకు చేరుకున్నామన్నారు. మరో మూడేండ్లు ఇదే పద్దతులను అవలంబిస్తూ కష్ట పడితే శ్రీలంక మాదిరి మలేరియా రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని అందుకు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలను కరతాల ధ్వనుల ద్వారా సమావేశం అభినందించింది.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….‘‘ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గొప్పగా పనిచేస్తున్నయి. అయితే ప్రతిసీజన్ లో సీజన్ ప్రారంభానికి ముందే వైద్యశాఖ తో అటు పంచాయితీరాజ్ శాఖ ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కలిసి కూర్చోని వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. ఈ విధానాన్ని ఒక పని సంస్కృతిగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రజల వైద్యం ఆరోగ్య విషయంలో అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సిఎం సూచించారు.బస్తీదవాఖానాలు బాగా పనిచేస్తున్నాయని సిఎం అభినందించారు. కెసిఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 29 నుంచి 55 శాతానికి పెరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల సూచికలను సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్లతో సహా అందరికీ అందించాలని సిఎం వైద్యాధికారులకు సూచించారు.
శాఖల అంతర్గత సమన్వయ సమావేశాలు..చార్టుల రూపకల్పన :
జిల్లా, మండల పీహెచ్ స్థాయిల్లో సీజనల్ వ్యాధులను తగ్గించేందుకు శాఖల వారీగా సమన్వయం అత్యంత అవసరమని సిఎం స్పష్టం చేశారు. వ్యాధుల ముందస్తు చర్యలకోసం ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ‘‘ వ్యాధులు ప్రబలినంక మందుల డబ్బాలు చేతుల పట్టుకోని తిరిగి పేరేశాన్ కాకుండ…సీజన్ ప్రారంభం కన్నాముందే…ఏ ఏ వ్యాధులు వ్యాపించే ప్రమాదమున్నదో చర్చించి వాటికి చర్యలు చేపట్లాలని సిఎం తెలిపారు.