రైతులకు మేలు కలిగేలా చేయాలి- సీఎం కేసీఆర్

408
CM KCR Review On New Agriculture Policy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్ర స్థాయి వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో పంటలకు మంచి ధర వచ్చి, రైతులకు మేలు కలిగేలా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో అనేక మార్లు చర్చించారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి? పండిన పంటను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? అనే విషయాలపై అధ్యయనం జరిగింది. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి నేరుగా జిల్లా వ్యవసాయాధికారులు, మండల వ్యవసాయాధికారులతో చర్చించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో సిఎం మాట్లాడతారు.

తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతున్నదని సిఎం చెప్పారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అద్భుత తెలంగాణ రూపొందుతున్నదని సిఎం అన్నారు. వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి, వ్యవసాయ యూనివర్సిటీ, పౌర సరఫరాల సంస్థ సమన్వయంతో వ్యవహరించి, రైతులకు మేలు చేసే వ్యవసాయ విధానాన్ని అమలు చేసే చైతన్యం కలిగించాలని సిఎం కేసీఆర్ కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో దాదాపు 90 లక్షల ఎకరాల్లో ప్రతీ ఏటా వరి పంట పండుతుంది. రెండు కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రాష్ట్రంలో రైస్ మిల్లులు తమ సామర్థ్యం పెంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ‘‘రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా, ఆ ముడి సరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీల సంస్థగా పౌర సరఫరాల సంస్థ రూపాంతరం చెందాలి. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలను అరికట్టవచ్చు’’ అని సిఎం అన్నారు.

- Advertisement -