రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు కరోనా బారినపడకుండా చూసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. నాగార్జునసాగర్‌లో ప్రచారం తీరుపై ఆదివారం సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా ముఖ్యనేతలతో ఆరాతీశారు.
జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను, పార్టీశ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని వారు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ‘అందరూ బాగా కష్టపడుతున్నారు. మనం మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. ఇంకో రెండుమూడ్రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి ’అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నట్టు సమాచారం.
అలాగే ఈనెల 15న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. 14న హాలియాలో నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బహిరంగ సభ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రతిఒక్కరికీ మాస్క్‌లు ఉండేలా చూడాలని, మాస్క్ లేనివాళ్లను సభా ప్రాంగణంలోకి అనుమతించకూడదని తెలిపారు. శానిటైజర్, నిర్ణీతదూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.