తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయంది. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు నిజాంసాగర్‌కు విడుదల చేయగా ఇందుకు హల్ది వాగు వేదికైంది. సీఎం కేసీఆర్ గోదావరి జలాలను హల్ది వాగులోకి విడుదల చేశారు. అంతకముందు వర్గల్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను ప్రస్తుతం సంగారెడ్డి కాల్వ నుంచి నిజాంసాగర్‌కు విడుదలచేశార. ఇది తాత్కాలికమే. మల్లన్నసాగర్ పనులు పూర్తికావడానికి మరో రెండుమూడు నెలలు పట్టే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగు,నిజాంసాగర్‌కు నీరు తరలిస్తున్నారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి విడుదలయ్యే కాళేశ్వర జలాలు తూప్రాన్ మండలంలోని గుండిరెడ్డిపల్లి వద్ద హల్దీ వాగులో కలుస్తుంది. ఇక్కడ ఏర్పాటుచేసే రెండు గేట్ల ద్వారా సింగూరుకు, హల్దీ వాగుకు కాళేశ్వర జలాలు చేరుతాయి. హల్దీ వాగు నుంచి నిజాంసాగర్‌కు నీరు చేరుతుంది. మల్లన్న సాగర్ నుంచి హల్ద్దీవాగు వరకు 32.9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
సంగారెడ్డి కెనాల్ ద్వారా 6.25 కిలోమీటర్ వద్ద సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయగా ఇక్కడినుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి జలాలు చేరుతాయి.అక్కడినుంచి వర్గల్ పెద్ద చెరువుకు.. ఆ తర్వాత శాకారం ధర్మాయి చెరువుకు, అక్కడి నుంచి అంబర్‌పేట ఖాన్ చెరువులోకి జలాలు తరలుతాయి. హల్దీవాగు నాచగిరి లక్ష్మీనర్సంహాస్వామి దేవస్థానం, తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరలో కలుస్తుంది.